Mahaa Daily Exclusive

  బ్యాలెట్ ఎన్నికలకు మేం సిద్ధం…

Share

బ్యాలెట్ ఎన్నికలకు మేం సిద్ధం.
* రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా?.
* సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్.
హైదరాబాద్, మహా.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవీఎంల పనితీరుపై చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈవీఎంల మీద నమ్మకం లేకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలకు రావాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, దమ్ముంటే రేవంత్ రెడ్డి ఈ సవాల్‌ను స్వీకరించాలని, అప్పుడు తాము కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
విదేశీ సంస్థల నిధులతో నడిచే పార్టీలతో, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తులతో కాంగ్రెస్ కలిసి ధర్నాలు చేయడం సిగ్గుచేటని బండి సంజయ్ మండిపడ్డారు. బంగ్లాదేశ్ తరహాలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసే నేహా బోరా, విదేశీ నిధులతో బొద్దింకల పార్టీ పెట్టిన అభిజీత్ దీప్కే, పాకిస్తాన్ నిధులతో నడిచే సంస్థల నేతలతో కలిసి పనిచేయడమే కాంగ్రెస్ దేశభక్తా? అని సూటిగా ప్రశ్నించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన (సర్) ప్రక్రియపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లు, అక్రమ వలసదారుల ఓట్లను తొలగిస్తుంటే కాంగ్రెస్‌కు ఎందుకు నొప్పని ఆయన నిలదీశారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే పదిసార్లు సర్ ప్రక్రియ జరిగిందని, ఆ ఓట్లతోనే గెలవాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు.
దేశ వ్యాప్తంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కనీసం ఆత్మవిమర్శ చేసుకోకుండా, ప్రతిసారీ ఓడిపోయినప్పుడు ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై విషం చిమ్ముతోందని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలు చేస్తామని, మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఎవరూ ఏమీ చేయలేరని, ఆయన నేతృత్వంలో భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుకోవడం ఖాయమని బండి సంజయ్ ఉద్ఘాటించారు. దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌పై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.