హైదరాబాద్, మహా : భారతదేశం 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అభివృద్ధి చెందిన దేశంగా, రాష్ట్రంగా రూపాంతరం చెందాలంటే ఏటా 8 శాతం ఆర్థిక వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని కార్మిక, ఉపాధి, శిక్షణ, గనులు మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆర్థిక వృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి సమ ప్రాధాన్యత నివ్వాలని ఆయన స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (డాక్టర్ ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి.ఐ.) స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి మరియు ప్రజా విధానాలు ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి
ఆర్థికాభివృద్ధిలో మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్న యువతకు ఉన్న నైపుణ్యాలకు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు మధ్య అంతరం ఉందని, ఈ వ్యత్యాసాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థలు తమకు అందుబాటులో ఉన్న కోర్సులు, శిక్షణకే పరిమితం కాకుండా పరిశ్రమలకు వాస్తవంగా అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాలని సూచించారు. ఇందుకోసం పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ప్రాయోగిక పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలతో కూడిన శిక్షణ అందించాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం 65 పారిశ్రామిక శిక్షణా సంస్థలను (ఐటీఐలు) అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా ఆధునీకరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. మరో 54 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, వచ్చే ఏడాది నాటికి మొత్తం 122 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తద్వారా యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన ఆధునిక సాంకేతిక శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ, ఇటీవల జపాన్, జర్మనీ దేశాల్లో పర్యటించిన సందర్భంగా అక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, తగినంత మానవ వనరులు అందుబాటులో లేకపోవడం, వృద్ధాప్య జనాభా పెరుగుదల కారణంగా ఆ ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతున్న పరిస్థితిని గమనించినట్లు మంత్రి తెలిపారు. ఈ పరిస్థితి భారతీయ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఆయా దేశాల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, అర్హతలను యువత సంపాదించుకోవాలని సూచించారు. భారతీయులు ఏ దేశానికి వెళ్లినా అక్కడి సమాజంతో సులభంగా కలిసిపోగలగడం, పరిస్థితులకు అనుగుణంగా మారగలగడం, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉండటం వారి ప్రత్యేకతలని పేర్కొన్నారు. ఈ లక్షణాలను సరైన నైపుణ్యాలతో జోడిస్తే అంతర్జాతీయ ఉద్యోగ విపణిలో మరింత మెరుగైన అవకాశాలను సాధించవచ్చని అన్నారు.
పెట్టుబడులను ఉపాధి కల్పనగా మలచాలని తెలుపుతూ
తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను ప్రస్తావిస్తూ, గత సంవత్సరం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా రాష్ట్రానికి రూ.5.74 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు లభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పెట్టుబడి అవకాశాలను పారిశ్రామిక విస్తరణ, ఆర్థిక కార్యకలాపాల పెంపు, యువతకు ఉపాధి కల్పనగా మలచడంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కీలకమని పేర్కొన్నారు. సుస్థిర ఆర్థిక వృద్ధి సాధనకు పెట్టుబడులతో పాటు మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య సమన్వయం, మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడం అత్యంత అవసరమని మంత్రి ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి.ఐ. డైరెక్టర్ జనరల్ శాంతికుమారి, అదనపు డైరెక్టర్ జనరల్ అనితా రామచంద్రన్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. మూర్తి, ఇతర ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి.ఐ. స్వర్ణోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో దాదాపు 12 రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది పరిశోధనా పత్రాల సమర్పకులు, విద్యావేత్తలు, విధాన నిపుణులు పాల్గొన్నారు. ఆర్థిక వృద్ధి, పర్యావరణ సుస్థిరత, ప్రజా విధానాలు, సమర్థవంతమైన పరిపాలన వంటి కీలక అంశాలపై జాతీయ స్థాయిలో చర్చలు, పరిశోధనా పత్రాల సమర్పణలు, అనుభవాల మార్పిడికి ఈ సదస్సు వేదికగా నిలిచింది.







