Mahaa Daily Exclusive

  దేశ సమగ్రత, ఐక్యతకు ఇద్దరు మహనీయుల సేవలు చిరస్మరణీయం…

Share

  • దేశ సమగ్రత, ఐక్యతకు ఇద్దరు మహనీయుల సేవలు చిరస్మరణీయం
  • హన్మకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామిరెడ్డి
  • ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
  • పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని, ప్రజా ప్రతినిధులు

 

హనుమకొండ, మహా;

 

భారత మాజీ ప్రధాని, భారత ఉక్కు మహిళ ఇందిరా గాంధీ 42వ వర్ధంతి, భారత తొలి ఉప ప్రధాని, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను శనివారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

 

హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశ సమగ్రత, సమైక్యత, ఐక్యత కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఇద్దరు మహనీయులను ఒకే రోజు స్మరించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. వందలాది సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి అఖండ భారత నిర్మాణానికి పునాది వేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు దక్కుతుందని, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ఆయన చూపిన దృఢ సంకల్పం, నాయకత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.

 

అదేవిధంగా ఇందిరా గాంధీ దేశాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన విప్లవాత్మక నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని తెలిపారు. ‘గరీబీ హటావో’ నినాదంతో పేదల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు బ్యాంకుల జాతీయీకరణ, భూసంస్కరణలు వంటి కీలక నిర్ణయాలతో సామాజిక, ఆర్థిక రంగాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన ఇందిరా గాంధీ సేవలు, త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

 

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. హనుమకొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి, వరంగల్ ఎనుమాముల మార్కెట్ చైర్మన్ పులి ప్రియాంక, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మాజీ కార్పొరేటర్లు, డీసీసీ కమిటీ సభ్యులు, మండల, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, నాయకురాళ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.