Mahaa Daily Exclusive

  ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా.. ?

Share

హైదరాబాద్, మహా: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ రాకకు సంబంధించి భారీగా చర్చ జరుగుతుంది. ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..? లేదా? అనే అంశంపై అటు నేతల్లో, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో సుమారుగా ఏడాది నుంచి ప్రజాక్షేత్రానికి దూరంగా ఉన్న కేసీఆర్ ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా లేదా? అనేదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ఫుల్ యాక్టీవ్ గా పోరాడుతున్నప్పటికీ కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనపిస్తుందంటూ ఇటు ప్రజలు, మరో వైపు నేతలు కూడా లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ రాక తీవ్ర ఆసక్తిగా మారింది.

 

ఎన్నికలు జరిగి ఏడాది గడుస్తుంది. అప్పటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రెండు సార్లు మాత్రమే వచ్చారు. అది ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి, మరోసారి బడ్జెట్ సమావేశాల మొదటిరోజు… ఈ రెండు రెండు రోజులు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. వీటితోపాటు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అడపాదడపాగా ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆ తరువాత మిగతా రోజులన్నీ కూడా ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు కేసీఆర్. కనీసం ప్రెస్ మీట్లు గానీ, బహిరంగ సభలు కానీ నిర్వహించలేదు. నేతలు, కార్యకర్తలు ఎవరైనా కూడా ఫామ్ హౌజ్ కే వెళ్లి కేసీఆర్ ను కలుస్తున్నారు. అవసరమైన వారిని అక్కడికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అంతే తప్ప ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్ బయటకు రావడంలేదు. కేటీఆర్, హరీశ్ రావు, ఇతర పలువురు కీలక నేతలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత కవిత తన ఆగమనం ప్రారంభించింది. దీక్షా దివస్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నది. అనుచరులు, కార్యకర్తలతో సమీక్షలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కవిత ఏపిసోడ్ స్టార్ట్ అయ్యిందని చెబుతున్నారు. కానీ, కేసీఆర్ ఇంకా బయటకు రావడంలేదనే చర్చ వినిపిస్తుంది.

 

ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. అసెంబ్లీకి రా కేసీఆర్.. ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యతను నిర్వర్తించూ అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు నిన్ను గెలిపించి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌజ్ లో ఉంటావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. హరీశ్ రావు, కేటీఆర్… వీళ్లెవరు కాదు నువ్వే అసెంబ్లీకి రా.. నువ్వా నేనా చూసుకుందాం.. ఏ టాపిక్ పై అయినా చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి కాలు దువ్వుతున్నారు. ఇందుకు బీఆర్ఎస్ నేతలు సీఎంపై రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. వీరి మధ్య ఎంత రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతున్నా కేసీఆర్ మాత్రం బయటకు రావడంలేదు. దీంతో ఇటు టీఆర్ఎస్ శ్రేణుల్లో, అటు ప్రజల్లో కలవరపాటు తప్పడంలేదు.

 

కాగా, రైతు పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు మాట్లాడుతూ తాము, తమ అధినేత కూడా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల ముందు పెడుతామన్నారు. హామీలు ఏమయ్యాయంటూ నిలదీస్తామన్నారు. కానీ, తమకు మైక్ కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ముందా అంటూ కూడా ఆయన సీఎంకు సవాల్ విసిరారు. అయితే, ఇది మాటల వరకే ఉంటుందా.. లేదా నిజంగానే ఆచరణలోకి వస్తుందా అనే సందేహంలో జనాలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు చోటు చేసుకున్న సందర్భాలే ఇందుకు కారణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, ఉన్న నేతలు కీలకంగా పోరాడుతున్నా, పలువురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్నా కేసీఆర్ మాత్రం మౌనం వీడడంలేదు.. ఫామ్ హౌజ్ ను వదలడంలేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఓ కింత బీఆర్ఎస్ కార్యకర్తలను ఆ కలవరపాటు వీడడంలేదు.

 

కేసీఆర్ ఒకవేళ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే పరిస్థితి ఎలా ఉండబోతుంది..? ప్రభుత్వాన్ని ఆయన ఏ విధంగా ఇరుకున పెడుతారు..? ఇంతకు ఆయనకు అసెంబ్లీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందా..? కేసీఆర్ కు ప్రభుత్వం మైక్ కట్ చేయకుండా సమయం కేటాయిస్తుందా..? లేదా మైక్ కట్ చేసి కేసీఆర్ ను అవమానిస్తుందా..? ఒకవేళ ఆ విధంగా అవమానిస్తే ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది..? గత కేసీఆర్ దర్శనమిస్తారా..? లేదా సైలెంట్ గా ఉండి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా? అనే అంశాలకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతుంది. అయితే, ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలతో చర్చలు ప్రారంభంచారని చెబుతున్నారు. ఇటు అధికార కాంగ్రెస్ కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎటువంటి ప్రసంగాలతో అటాక్ చేయాలనేదానిపై చర్చిస్తున్నారంటా. చూడాలి మరి వాట్ విల్ హ్యాపెన్ అనేది.