- -నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మిస్తాం
- -ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు ప్రత్యేక కోటా
- -గత ఇందిరమ్మ ఇళ్ల రుణాలు మాఫీ
- -కేటీఆర్, హరీశ్… చిన్న పిల్లల్లా వ్యవహరించొద్దు
- -తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం
- -కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన సూచనలివ్వాలి
- -ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తున్నామని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఆత్మ గౌరవాన్ని ఇందిరా గాంధీ కల్పించారని కొనియాడారు. ఆత్మగౌరవంతో బతకాలనుకుంటే సొంత ఇల్లు ఉండాలని, ఆ కల నెరవేరాలనే ఇందిరా గాంధీ ఇళ్లు నిర్మించి ఇచ్చారని సీఎం తెలిపారు. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదని చెప్పగలనని సీఎం అన్నారు. కూడు.. గూడు.. గుడ్డ… నినాదాన్ని ఇందిరా గాంధీ ఆచరణలోకి తీసుకువచ్చారన్నారు. సీలింగ్ యాక్ట్ ద్వారా గిరిజనులు, దళితులకు మిగులు భూముల పంపిణీ చేపట్టారని, ఇళ్ల నిర్మాణం చేపట్టారని సీఎం తెలిపారు. ఇందిరమ్మ హయాంలో ఇంటి నిర్మాణానికి రూ. 10 వేలు కేటాయిస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది రూ. 1.25 లక్షలకు చేరిందని… పెరిగిన ధరల ప్రకారం ఇప్పుడు తమ ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా.. గ్రీన్‌ఛానల్ ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షలు అందజేస్తామంటూ హామీ ఇచ్చారు. తొలి ఏడాది సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేస్తామని, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య సిబ్బంది, దళితులు, గిరిజనులు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గిరిజనులకు ఇళ్లు కేటాయించారని, ఆ తర్వాత వారికి ఇళ్ల కేటాయింపు సక్రమంగా జరగలేదన్నారు. తమ ప్రభుత్వం ఐటీడీఏల పరిధిలోని నియోజకవర్గాలు, ఆ ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రత్యేక కోటా ఇస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. నల్లమల్లలోని చెంచులు… ఆదిలాబాద్‌లోని గోండులు… భద్రాచలంలోని కోయలు.. ఎవరైతే తెలంగాణ మట్టి మనుషులో.. తెలంగాణ మూల పురుషులో వారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంద్రవెల్లికి వెళ్లి తాను స్వయంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పట్టాలు అందజేసిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఈ నమూనానే పాటించాలని తాము సూచించడం లేదని, అదే సమయంలో తమకున్న స్థలంలో ప్రతి అంగుళాన్ని లబ్ధిదారులు వినియోగించుకునేలా ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్‌లు నిర్మిస్తామని, లబ్ధిదారులు తమ అవగాహన కోసం వాటిని చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. లబ్ధిదారులు తమ స్థోమతకు తగ్గట్లు అదనపు గదులు నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని కూడా చెప్పారు.
గత రుణాలు కూడా మాఫీ
2004 నుంచి 2014 వరకు పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 25.04 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇళ్లను పిట్ట గూళ్లని.. కొడుకు, కోడలు, అల్లుడు, బిడ్డ వస్తే ఎక్కడ ఉంటారని ఎన్నికల ప్రచార సభల్లో విమర్శలు గుప్పించిన కేసీఆర్ తన పదేళ్ల పాలనా కాలంలో కేవలం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభించి 65 వేల ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని సీఎం విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 35 వేల ఇళ్ల పూర్తికి తాము రూ.195 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదని… కానీ ఆరు నెలల్లో ఆయన కోసం కోట లాంటి ప్రగతి భవన్‌ను, వాస్తు కోసం సచివాలయాన్నినిర్మించుకున్నారని, గజ్వేల్, జన్వాడల్లో ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారంటూ సీఎం మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ భవనాల కోసం ఎకరాల కొద్ది భూమి కేటాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపాలు ఉంటే ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుందని, పేదవాళ్లకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను సైతం వినియోగిస్తున్నామన్నారు. పునాది స్థాయి నుంచి స్లాబు వరకు ప్రతి దశలోనూ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించడమే కాకుండా శాఖకు పూర్తి స్థాయి సిబ్బందిని ఇస్తున్నామంటూ వెల్లడించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
కేసీఆర్ ఆలోచనా విధానంలో మార్పు రావాలి
గత కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్ర ఖజానాను కేసీఆర్‌కు అప్పగిస్తే.. పదేళ్ల పాలనా కాలం తర్వాత ఆయన రూ. 7 లక్షల కోట్ల అప్పుతో తమకు అప్పగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనా కాలంలో చేసిన అప్పులు.. తప్పులు సరి చేయడానికి తమకు సమయం పడుతోందన్నారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేసిన కేసీఆర్ తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నివేదికల రూపంలో అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారని.. నాడు అటువంటి మంచి సంప్రదాయం ఉందని.. దానిని కొనసాగించాలంటూ కేసీఆర్ కు సీఎం సూచించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న హరీశ్ రావు ఆయను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారని… కాంగ్రెస్‌లో చేరేందుకే హరీశ్‌రావు కలిశారనే విమర్శలు నాడు వచ్చాయని సీఎం అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ది పనుల కోసం రాజశేఖర్ రెడ్డిని కలిశానని హరీశ్ చెప్పారని.. ఇప్పుడు అలానే కలిసి సమస్యలు విన్నవించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడే రాజశేఖర్‌రెడ్డిని హరీశ్‌రావు కలిశారని.. మరి ఇప్పుడేమైందని సీఎం ప్రశ్నించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రులను కలిసి కొడంగల్ నియోజకవర్గానికి రూ. వందల కోట్లు తీసుకెళ్లానని సీఎం తెలిపారు. పాలక, ప్రతిపక్షాలు కలవకుండా చేసింది కేసీఆరేనని, శత్రు దేశ సైనికుల్లా రెండు పక్షాలను కేసీఆర్ మార్చివేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్‌లో మానసిక పరివర్తనలో మార్పు రావాలన్నారు. తమిళనాడులో రాజకీయ వైరుధ్యాలు ఎంతగా ఉన్నా ఆ రాష్ట్ర అంశాల విషయంలో పార్టీలకు అతీతంగా వారంతా ఏకమవుతారని.. ఇక్కడ కూడా అలానే కావాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి సాధించాల్సిన అంశాలపై రాష్ట్రంలో 17 మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులకు సూచనలు ఇచ్చేందుకు కలిసి రావాలని కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు.
చిన్న పిల్లల్లా వ్యవహరించొద్దు
తాము పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఆరు నెలలు లోక్‌సభ ఎన్నికల కోడ్‌తోనే సరిపోయిందని.. కేవలం అయిదు నెలల కాలమే తాము పాలనపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టగలిగామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ అయిదు నెలల కాలంలోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తాము అభివృద్ధి.. సంక్షేమం రెండింటినీ సమతూకం చేసుకుంటూ ముందుకు పోతుంటే చిన్న పిల్లల్లా కేటీఆర్, హరీశ్ రావు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేయలేనిది తాము ఏడాది కాలంలోనే చేస్తుంటే.. హోం వర్క్ చేయని పిల్లలు హోం వర్క్ చేసిన పిల్లాడి నోట్ బుక్ ను చింపివేసినట్లు.. పక్కన వాడి చేతిలో ఆట బొమ్మలు విరగొట్టే చిన్న పిల్లల్లా ఆ ఇద్దరు (హరీశ్‌రావు, కేటీఆర్‌ను ఉద్దేశించి) ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. మనం చేయలేని పని వాళ్లు చేస్తున్నందున.. చూస్తూ ఉండాలని వారిద్దరికి హితవు చెప్పాలని కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు మారీచు సుబాహుల్లా, రాహు కేతువుల్లా వారు అడ్డుపడుతున్నారని సీఎం మండిపడ్డారు. తమకు భేషజాలు లేవని వయసులో, అనుభవంలో కేసీఆర్ పెద్దవారని, ఆయన పెద్దరికాన్ని నిలుపుకోవాలని, తప్పులు చేస్తున్న తమ పిల్లలకు బుద్ది చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాసన సభలో పాలక పక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతిపక్షానికి అంతే ప్రాధాన్యత ఉందని సీఎం అన్నారు. కేసీఆర్ సభకు వచ్చి తాము పాటించే విధానల్లో ఏవైనా లోపాలుంటే తమకు తెలియజేయాలన్నారు.
కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం…
సచివాలయంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 7, 8, 9 తేదీల్లో సచివాలయ ప్రాంగణం.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు అద్భుతంగా నిర్వహించనున్నట్లు సీఎం చెప్పారు. తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టే కార్యక్రమాలు, పిండి వంటలు, మహిళా సంఘాల స్టాళ్లతో ఒక పండుగ వాతావారణం నెలకొంటుందన్నారు. బోనాలు, వినాయక నిమజ్జనం చేసుకునేప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం ఉంటుందన్నారు. ప్రజలంతా వాటిలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేత కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఎంఐఎం, సీపీఐ, ఇతర ప్రతిపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు సీఎం తెలిపారు. కేసీఆర్ తోపాటు కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కలిసి ఆహ్వానిస్తారని సీఎం తెలిపారు. ఈ ఉత్సవానికి ప్రతిపక్ష నేత వచ్చి పెద్దరికం నిలుపుకోవాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.