Mahaa Daily Exclusive

  కార్పొరేటర్ టూ సీఎం.. అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఫడ్నవీస్..

Share

  • మూడవసారి సీఎం ఫీఠాన్ని అధిష్టించిన నేత
  • సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్
  • విజయాలను అందించడంలో దిట్ట

 

ముంబై, మహా : ‘నేను సముద్రంలాంటివాడిని, మళ్లీ తిరిగొస్తా’– 2019లో సీఎం పదవి కోల్పోయిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పిన మాట ఇది. ఆ తర్వాత 2022లో మహావికాస్ అఘాడీ నుంచి అధికారం దక్కించుకున్నా, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంకే పరిమితమయ్యారు. దాంతో స్థాయి తగ్గిందంటూ ప్రత్యర్థులు ఫడ్నవీస్ను ఎగతాళి చేశారు. రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుపోయారని ఎద్దేవా చేశారు. కానీ, వాళ్లందరికీ తిరిగులేని సమాధానిస్తూ ఆధునిక అభిమన్యుడిలా రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ, ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు ఫడ్నవీస్. మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేటర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు అంచెలంచెలుగా ఫడ్నవీస్ ఎదిగారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తానున్నానంటూ ముందుకొచ్చి మంచి విజయాలను అందించడంలో దిట్టగా పేరొందారు ఫడ్నవీస్.

 

రాజకీయ కుటుంబం

 

మహా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ 1970 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి గంగాధరరావు ఫడ్నవీస్, తల్లి సరిత. ఫడ్నవీస్ తండ్రి గంగాధరరావు నాగ్పుర్ నుంచి మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. తల్లి సరితా ఫడ్నవీస్ విదర్భ హౌసింగ్ క్రెడిట్ సొసైటీ మాజీ డైరెక్టర్. గంగాధర ఫడ్నవీస్ను కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ పలుమార్లు తన రాజకీయ గురువుగా అభివర్ణించారు. దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత బ్యాంకర్, సామాజిక కార్యకర్త. ఈ దంపతులకు దివిజా ఫడ్నవీస్ అనే కుమార్తె ఉంది. అలాగే ఫడ్నవీస్ సోషల్ మీడియాలోనూ స్టార్గా నిలిచారు. ఆయనకు ఎక్స్లో 59 లక్షలు, ఫేస్బుక్లో 91లక్షలు, ఇన్‌స్టాగ్రామ్లో 20 లక్షలు, యూట్యూబ్లో 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నేతగా ఫడణవీస్ అవతరించారు.

 

రాజకీయ నేపథ్యం

 

1989లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు చెందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విభాగంలో ఫడ్నవీస్ పనిచేశారు. 22 ఏళ్లకే నాగ్‌పుర్‌ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 27 ఏళ్లకే నాగ్‌పుర్‌ మేయర్‌గా ఎన్నికై అత్యంత పిన్న వయస్సులో మేయర్‌ అయిన వ్యక్తిగా రికార్డుకెక్కారు. 1999లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్పుర్ సౌత్ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2013లో మహారాష్ట్ర బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు ఫడ్నవీస్. మహారాష్ర్టలో 2014 లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక పాత్ర పోషించారు. 2014లో బీజేపీ, శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఫడ్నవీస్ మహారాష్ట్రకు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తన మొదటి పదవీ కాలంలో సేవా హక్కు చట్టాన్ని అమలు చేశారు. అలాగే కరవును ఎదుర్కోవడమే లక్ష్యంగా ‘జలయుక్త్ శివార్ అభియాన్’ను ప్రారంభించారు. దీంతో 22,000 కంటే ఎక్కువ గ్రామాల్లో రూ.6 లక్షల కంటే తక్కువ ఖర్చుతో కూడిన నీటి నిర్మాణాలను అభివృద్ధి చేశారు. ముంబై, పూణే మెట్రో విస్తరణ, నాగ్‌పుర్-ముంబై సమృద్ధి ఎక్స్‌ ప్రెస్ వే, కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్, ముంబై ట్రాన్స్ హార్బర్ వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేశారు. తన మొదటి పదవీ కాలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడం సహా పాటు సుపారిపాలన సాగించిన సీఎంగా ప్రజల్లో ఫడ్నవీస్ ఆదరణ పొందారు.

 

తప్పని పరిస్థితిలో డిప్యూటీ సీఎంగా

 

2022లో మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఫడ్నవీస్ తన రాజకీయ చతురతను నిరూపించుకున్నారు. శివసేన అగ్రనేత ఏక్‌ నాథ్ షిండేకు సీఎం పగ్గాలు అప్పగించి, ఆయన ఉపముఖ్యమంత్రిగా కొనసాగారు. తాజాగా జరిగిన మహా ఎన్నికల్లో మహాయుతిని విజయం పథంలో నడిపించి మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు.

 

ఇవీ రికార్డులు

 

మహారాష్ట్ర చరిత్రలో సీఎంగా పూర్తి పదవీ కాలం పని చేసిన రెండో ముఖ్యమంత్రి ఫడణవీస్. 2014-2019 ఫడ్నవీస్ మహా సీఎంగా కొనసాగారు. 1962-1967 వరకు వసంత్ రావు పూల్ సింగ్ నాయక్ సీఎంగా పూర్తి కాలం పని చేశారు. మహారాష్ట్ర దిగ్గజ నేతలు యశ్వంతరావు చవాన్, శంకర్రావు చవాన్, వసంతదాదా పాటిల్, మనోహర్ జోషి, శరద్ పవార్ వంటివారు పూర్తి కాలం సీఎం పదవిలో కొనసాగలేకపోయారు. మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన బ్రాహ్మణ వర్గానికి చెందిన రెండో నేతగా ఫడణవీస్‌ రికార్డు సాధించారు. ఆయన కన్నా ముందు బ్రాహ్మణ వర్గానికి చెందిన మనోహర్ జోషి మహారాష్ట్రకు సీఎంగా పనిచేశారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏకైక ఉప ముఖ్యమంత్రి కూడా ఫడ్నవీసే. మహారాష్ట్రకు అతిపిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తిగా కూడా నిలిచారు ఫడ్నవీస్. 44 ఏళ్ల వయసులో 2014లో సీఎం బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలో అతిపిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రికార్డు శరద్ పవార్ పేరిట ఉంది. దేశంలో మూడో అతి తక్కువ కాలం సీఎంగా పని చేసిన రికార్డును బీజేపీ నేత యడియూరప్పతో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ పంచుకున్నారు. 2019 నవంబర్ లో సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవీస్ మూడు రోజుల్లోనే పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.