Mahaa Daily Exclusive

  హిందూత్వం అంటేనే ద్వేషం.

Share

  •  సనాతన ధర్మానికి ముడిపెట్టొద్దు.
  •  రామాలయ విరాళాల లెక్కలేవి?
  •  బీజేపీపై దిగ్విజయ్ సింగ్ డైరెక్ట్ ఎటాక్.

ఢిల్లీ, మహా.

కాంగ్రెస్ కురువృద్ధుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ హిందూత్వంపై మరోసారి పొలిటికల్ బాంబ్ పేల్చారు. హిందూత్వం అనేది సమాజంలో కేవలం ద్వేషపు బీజాలు నాటుతుందని, అలాంటి విషపూరిత భావజాలానికి ప్రజలు ఆమడదూరంలో ఉండాలని ఆయన సంచలన పిలుపునిచ్చారు. హిందూత్వం వైపు ఆకర్షితులయ్యే వారి మెదళ్లలో కేవలం ద్వేషం తప్ప మరేమీ ఉండదంటూ నేరుగా బీజేపీ విధానాలపై డైరెక్ట్ ఎటాక్‌కు దిగారు. అసలైన సనాతన ధర్మానికి, ఈ రాజకీయ హిందూత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న ఆయన.. కొందరు కావాలనే సనాతన ధర్మాన్ని హిందూత్వంగా కల్తీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు వ్యత్యాసాన్ని విడమర్చి చెప్పకపోతే అమాయకులు ఆ మాయలో పడిపోయే ప్రమాదం పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చారు.

ఎనిమిది పదుల వయసులో ఉజ్జయిని నుంచి అయోధ్య వరకు ఏకంగా వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ ‘సత్య సనాతన స్వాభిమాన్ యాత్ర’కు శ్రీకారం చుట్టిన దిగ్విజయ్ సింగ్.. తొలి దశ పూర్తి చేసుకుని తన సొంత ఇలాకా రాఘవ్‌గఢ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుమారుడు జైవర్ధన్ సింగ్ నుంచి ఘన స్వాగతం అందుకున్న ఆయన.. భారీ బహిరంగ సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలైన సనాతన ధర్మం ‘వసుధైవ కుటుంబకం’ అనే విశ్వమానవ కల్యాణాన్ని, సర్వజన సౌభ్రాతృత్వాన్ని ప్రబోధిస్తుంటే.. కొందరు మాత్రం దానికి ద్వేషపు రంగు పులిమి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

తన ఈ వయసులో ఇంత సాహసోపేత పాదయాత్ర చేయడానికి గల రెండు బలమైన కారణాలను దిగ్విజయ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసి నిరంకుశత్వాన్ని సింహాసనం ఎక్కించే చీకటి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ల దొంగతనం ఇష్యూని ప్రస్తావిస్తూ.. ఈవీఎంల ట్యాంపరింగ్ నీడలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోలేమన్నారు. వెంటనే ఆ ఈవీఎంల వ్యవస్థను రద్దు చేసి, రాబోయే ఎన్నికలన్నీ పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ల ద్వారానే పారదర్శకంగా నిర్వహించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఇదే వేదికపై తన మెడలోని ‘ఓం నమః శివాయ’ కండువాను ప్రస్తావిస్తూ.. దానికీ కామ్రేడ్లకూ ఏం సంబంధమంటూ చురకలంటించారు.

ఇక తన యాత్ర వెనుక ఉన్న రెండో అతిపెద్ద కారణం.. సనాతన ధర్మం ముసుగులో హిందూత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దడాన్ని అడ్డుకోవడమేనని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 1992 నాటి లాల్‌కృష్ణ అద్వాణీ రథయాత్రను గుర్తుచేసిన ఆయన.. అప్పట్లో దాన్ని మహాంత్ లాల్‌దాస్ ఎలా బహిరంగంగా వ్యతిరేకించారో వివరించారు. ముఖ్యంగా రామ్ మందిర నిర్మాణం కోసం అప్పట్లో వసూలు చేసిన ఏకంగా 1,400 కోట్ల రూపాయల విరాళాల లెక్కలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆ నిధులపై మహాంత్ లాల్‌దాస్ నిలదీస్తే.. కేవలం 8.29 కోట్లకు మాత్రమే లెక్కలు చూపించి చేతులు దులుపుకున్నారని సంచలన బాంబు పేల్చారు. దేవుడి పేరుతో, సనాతన ధర్మం పేరుతో సాగుతున్న ఈ తప్పుడు ప్రచారాల గుట్టు రట్టు చేసి ప్రజల కళ్లు తెరిపించడమే తన యాత్ర అసలు లక్ష్యమని దిగ్విజయ్ సింగ్ సింహగర్జన చేశారు.