Mahaa Daily Exclusive

  రాహుల్ ఓ ఫెయిలైన విద్యార్థి.

Share

  •  ప్రతి పరాజయానికీ ఓ కొత్త సాకు.
  •  కాంగ్రెస్ అగ్రనేతపై యోగి ఆదిత్యనాథ్ వ్యంగ్యాస్త్రాలు.

ఢిల్లీ, మహా.

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గాజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని తొలగించండి’ నినాదంతో గురువారం నిర్వహించిన భారీ పాదయాత్రలో యోగి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన ఓ ఆసక్తికరమైన గ్రామీణ విద్యార్థి కథను చెబుతూ తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ రాజకీయ పరిస్థితి.. పదేపదే పరీక్షల్లో ఫెయిలవుతూ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిసారీ ఓ కొత్త సాకు చెప్పే విద్యార్థిలా తయారైందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

సభలో యోగి ప్రసంగిస్తూ.. “ఒక విద్యార్థి పరీక్షల్లో పదేపదే ఫెయిలవుతుంటాడు. కానీ, తన తప్పు ఒప్పుకోడు. మొదటిసారి ఫెయిలైనప్పుడు టీచర్ కావాలనే ఆన్సర్ షీట్ మార్చేశారని సాకు చెబుతాడు. రెండోసారి సిలబస్ దాటి ప్రశ్నలు ఇచ్చారని అంటాడు. మూడోసారి పరీక్షకు వెళ్తే తన పెన్నులో సిరా అయిపోయిందని కబుర్లు చెబుతాడు. ఇక నాలుగోసారి తన ముందు కూర్చున్న కుర్రాడు స్పీడ్‌గా రాయడం వల్ల తన ఏకాగ్రత దెబ్బతిన్నదని అంటాడు” అంటూ రాహుల్ ఎన్నికల పరాజయాలను ఆ విద్యార్థి వైఫల్యాలతో పోల్చుతూ తీవ్ర వ్యంగ్యం ప్రదర్శించారు. రాజకీయాల్లో ప్రజల తీర్పును గౌరవించడం మానేసి, తమ వైఫల్యాలకు ప్రతిసారీ ఓ కొత్త సాకు వెతుక్కోవడమే కాంగ్రెస్ నాయకత్వం పనిగా పెట్టుకుందని ఆయన దుయ్యబట్టారు.

రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష కూటమి తీరుపైనా యోగి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల పరాజయాలకు నాయకత్వం బాధ్యత వహించాలని, అది చేతకాక ఈవీఎంలు తదితర కారణాలను చూపుతూ కుంటిసాకులు చెప్పడం మానుకోవాలని పరోక్షంగా హితవు పలికారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు ప్రయత్నించకుండా కేవలం ఆరోపణలకే పరిమితమైతే రాజకీయంగా మనుగడ కష్టమని హెచ్చరించారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ పాదయాత్రలో యోగి చేసిన ఈ వ్యంగ్య వ్యాఖ్యలు యూపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.