- డిసెంబర్లో స్వదేశానికి షేక్ హసీనా
- ఏ పరిణామం ఎదురైనా ఎదుర్కునేందుకు సిద్ధమన్న నేత
- మరణశిక్షపై సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మహా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మరణశిక్ష విధించినా డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వస్తానని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె తన సొంత దేశానికి తిరిగి వెళ్లాలనే నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. మరణమే ఎదురైనా తన దేశంలో, తన ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒక వార్తా సంస్థకు ఈమెయిల్ ద్వారా ఇచ్చిన సమాధానాల్లో హసీనా ఈ విషయాలను వెల్లడించారు. తనను అరెస్టు చేసి జైలులో పెట్టవచ్చని, కావలంటే హింసించవచ్చని, లేదంటే చంపుతారని తనకు తెలుసన్నారు. అయినా సరే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనే నిర్ణయాన్ని మార్చుకోనని స్పష్టం చేశారు.
షేక్ హసీనా 1996 నుంచి 2001 వరకు, తిరిగి 2009 నుంచి 2024 వరకు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేశారు. అయితే 2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఉద్యమం ఆమె ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ఆమె బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత ఆమెపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2025లో బంగ్లాదేశ్ ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. నిరసనకారులపై జరిగిన హింసకు ఆమె బాధ్యురాలని కోర్టు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ఆ సమయంలో జరిగిన అల్లర్లలో సుమారు 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే హసీనా ఈ ఆరోపణలను ఖండించారు. తనపై జరిగిన విచారణ చట్టబద్ధంగా లేదని, న్యాయస్థానం తీర్పును అంగీకరించనని గతంలోనే స్పష్టం చేశారు.
హసీనాను అప్పగించాలని భారత్‌కు విజ్ఞప్తి
హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం పలుమార్లు భారత్‌ను కోరింది. అయితే ఈ అంశం చట్టపరమైన పరిశీలనలో ఉందని భారత్ తెలిపింది. హసీనా తిరిగి వచ్చే విషయంలో కచ్చితమైన తేదీ చెప్పలేమని ఢాకాలోని భారత హైకమిషనర్ దినేష్ త్రివేది గతంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రక్రియ చట్టబద్ధంగా కొనసాగుతోందని తెలిపారు.
అవామీ లీగ్ నేతలపై వేధింపులంటూ ఆరోపణలు
తన పార్టీ అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై ప్రస్తుత ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని హసీనా ఆరోపించారు. 2024 ఆగస్టు నుంచి తమ పార్టీకి చెందిన కనీసం 20 వేల మంది సభ్యులు హత్యకు గురయ్యారని ఆమె పేర్కొన్నారు. వేలాది మందిని అరెస్టు చేసి వేధిస్తున్నారని, మరికొందరు ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లారని ఆరోపించారు.తమ పార్టీపై నిషేధం కొనసాగుతోందని, సాధారణ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి లేదని ఆమె అన్నారు.
బంగ్లాదేశ్‌లో తీవ్రవాద గ్రూపులపై ఆందోళన
దేశంలో కఠిన భావాలు కలిగిన గ్రూపుల ప్రభావం పెరుగుతోందని హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇలాంటి శక్తులకు మరింత బలం ఇస్తున్నాయని అన్నారు. గతంలో తన ప్రభుత్వం తీవ్రవాద గ్రూపులపై కఠినంగా వ్యవహరించిందని గుర్తుచేశారు.మైనారిటీ వర్గాలపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలపైనా పలు హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఈ ఆరోపణలను తాత్కాలిక ప్రభుత్వం ఖండించింది.
విదేశీ దేశాల సహాయం అవసరం లేదన్న హసీనా
తాను సురక్షితంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు భారత్, అమెరికా వంటి దేశాలు ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు హసీనా ఆసక్తికరంగా స్పందించారు.తన స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ఏ విదేశీ దేశం అనుమతి లేదా సహాయం అవసరం లేదని అన్నారు. అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటానని, అయితే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనే తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు. మొత్తంగా మరణశిక్ష తీర్పు, రాజకీయ అనిశ్చితి, పార్టీపై నిషేధం వంటి పరిస్థితుల మధ్య షేక్ హసీనా చేసిన తాజా వ్యాఖ్యలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.







