Mahaa Daily Exclusive

  రక్తం పీల్చే జలగలపై సీపీ సుమతి సర్జికల్ స్ట్రైక్.

Share

  •  వృద్ధురాలి కార్లు లాక్కున్న కాల్‌మనీ కిలాడీల ఆటకట్టు!
  •  అక్రమ ఫైనాన్స్ ముఠాపై ఉక్కుపాదం.

హైదరాబాద్, మహా.

అవసరానికి అప్పు ఇస్తారు.. ఆపై అందినకాడికి నిలువునా దోచేస్తారు! అప్పు తీర్చినా డాక్యుమెంట్లు ఇవ్వరు.. అడిగితే ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు! ఇలా సిటీలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, వ్యాపారులు, వృద్ధులే టార్గెట్‌గా రెచ్చిపోతున్న అక్రమ ఫైనాన్స్ ముఠాపై మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఉక్కుపాదం మోపారు. జలగల్లా రక్తం పీలుస్తున్న ఓ కరుడుగట్టిన కాల్ మనీ గ్యాంగ్‌కు చెక్ పెట్టారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులతో కలిసి పక్కా స్కెచ్ వేసి గురువారం నలుగురు కంత్రీలను కటకటాల వెనక్కి నెట్టారు. వీరి దగ్గరి నుంచి రెండు కార్లు, 12 మొబైల్స్, 25 ప్రామిసరీ నోట్లు, 22 బ్లాంక్ చెక్కులు, రెండు సేల్ డీడ్లు, 47 వేలకు పైగా క్యాష్‌తో పాటు రెండు పాస్ పుస్తకాలను పోలీసులు సీజ్ చేశారు. అక్టోబర్ 26న ఈ ముఠాలోని ముగ్గురిని అరెస్ట్ చేయగా.. తాజా అరెస్టులతో కటకటాలు లెక్కిస్తున్న వారి సంఖ్య ఏడుకు చేరింది. ఇంకా పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. వీరిపై ఇప్పటికే ఎల్బీనగర్, నేరేడ్‌మెట్, కీసర పీఎస్‌లలో ఏకంగా నాలుగు కేసులు నమోదయ్యాయని సీపీ సుమతి స్వయంగా వెల్లడించారు.

అసలు ఈ గ్యాంగ్ దందా అంతా పక్కా ప్లాన్ ప్రకారం నడుస్తుంది. బ్రోకర్లను పెట్టి వల విసరడం.. లక్షల్లో అప్పు ఇప్పిస్తామని ఆశ చూపడం వీరి స్టైల్. తీరా అప్పు ఇచ్చేటప్పుడు ముందస్తు వడ్డీ కింద భారీగా డబ్బులు కట్ చేసుకుని, చేతిలో సగం పైసలు మాత్రమే పెడతారు. కానీ, బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై మాత్రం అసలు అప్పు కంటే డబుల్ అమౌంట్‌కు సంతకాలు పెట్టించుకుంటారు. వడ్డీతో సహా అప్పు మొత్తం తీర్చినా డాక్యుమెంట్లు తిరిగివ్వకుండా మరింత డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. అడిగినంత ఇవ్వకపోతే భౌతిక దాడులు చేయడం, క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఏఐ టెక్నాలజీతో క్యాన్సర్ గుర్తించే మిషన్ కొందామనుకున్న ఓ వృద్ధురాలైన మహిళా డాక్టర్‌ను సైతం ఈ ముఠా వదల్లేదు. ఆమెను నమ్మించి మోసం చేయడమే కాకుండా.. ఏకంగా ఆమెకు చెందిన స్కోడా, ఇన్నోవా హైక్రాస్ కార్లను దౌర్జన్యంగా లాగేసుకున్నారంటే వీళ్ల బరితెగింపు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి అక్రమ ఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల ఆగడాలను ఏమాత్రం సహించేది లేదని, అవసరమైతే ఈ గ్యాంగ్‌పై రౌడీ షీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ కింద లోపల వేస్తామని సీపీ సుమతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్థిక కష్టాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో వెళ్లాలి తప్ప.. ఇలాంటి సైకో ఫైనాన్సర్ల వలలో పడి బ్లాంక్ చెక్కులు, బాండ్లు, ప్రామిసరీ నోట్లపై గుడ్డిగా సంతకాలు చేయొద్దని ప్రజలను హెచ్చరించారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ, లోకల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌తో బట్టబయలైన ఈ కాల్ మనీ బాగోతం ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్‌గా మారింది.