- కండక్టర్ ప్రవళిక మృతితో ఎట్టకేలకు నిద్రలేచిన ఆర్టీసీ.
హైదరాబాద్, మహా.
మహిళా కండక్టర్ ప్రవళిక ప్రాణత్యాగంతో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు కళ్లు తెరిచింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై సీరియస్ ఫోకస్ పెట్టిన సంస్థ.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా నడిచే ప్రతి బస్సుకు తప్పనిసరిగా డోర్లు ఉండాల్సిందేనని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు తలుపులు లేకుండా రోడ్డెక్కుతున్న బస్సులన్నింటికీ తక్షణమే డోర్లు బిగించాలని, ఆ డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే డ్రైవర్లు బస్సును ముందుకు పోనివ్వాలని స్పష్టమైన హుకుం జారీ చేసింది. ప్రవళిక లాంటి మరో ప్రాణం గాలిలో కలవకుండా ఉండేలా ఈ భద్రతా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక విధుల్లో ఉండగా జరిగిన దారుణం ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది. బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలితో టికెట్ విషయంలో జరిగిన చిన్న వివాదం ప్రవళిక ప్రాణాలను బలిగొంది. ఆ ప్రయాణికురాలు విచక్షణ కోల్పోయి కండక్టర్ను కదులుతున్న బస్సులోంచి బయటకు నెట్టేయడంతో ప్రవళిక రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది.. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
ఈ హృదయ విదారక ఘటనపై చలించిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం, ఆర్టీసీ సంయుక్తంగా రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. దీనికి అదనంగా ఆర్టీసీ ప్రత్యేక పాలసీ కింద ఏకంగా రూ.కోటి ప్రమాద బీమాను కూడా ఆ కుటుంబానికి అందజేయనున్నారు. ఆర్థిక సాయంతో పాటు, ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఓ ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ కుండబద్దలు కొట్టారు.








