ఖమ్మంలో కిరాణా కిలాడీలపై కొరడా.
* బియ్యం బస్తాల్లో తూకం కోత.
* నాలుగు దుకాణాల్లో 53 బస్తాలు సీజ్.
* వ్యాపారులకు భారీ ఫైన్!
ఖమ్మం, మహా.
ఖమ్మం నగరంలో కస్టమర్ల జేబులకు చిల్లులు పెడుతున్న కిరాణా, రైస్ స్టోర్ల కిలాడీ వ్యాపారుల భరతం పట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా కలెక్టర్ పక్కా ఆదేశాలతో గురువారం పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, లీగల్ మెట్రాలజీ అధికారులు ఏకకాలంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. బస్తా మీద ముద్రించిన బరువుకు, లోపల ఉన్న బియ్యానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో వ్యాపారులు తూకంలో పక్కాగా మోసం చేస్తున్నట్లు ఈ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో నిబంధనలు తుంగలో తొక్కిన సదరు చీటింగ్ వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ చట్టం కింద కొరడా ఝుళిపించి భారీ జరిమానాలు వడ్డించారు. అంతేకాకుండా తూకం తక్కువగా ఉన్న ఏకంగా 53 బియ్యం బస్తాలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ఈ విస్తృత తనిఖీల్లో అధికారుల కళ్లుగప్పి దందా చేస్తున్న నాలుగు షాపుల బాగోతం బయటపడింది. మామిళ్లగూడెంలోని ‘లక్ష్మీ వేంకటేశ్వర కిరాణా అండ్ జనరల్ మర్చంట్’లో తూకం తక్కువగా ఉన్న రూ.18 వేల విలువైన 12 బస్తాలను అధికారులు సీజ్ చేశారు. అదే ఏరియాలోని ‘శ్రీ లక్ష్మీ బాలాజీ కిరాణా అండ్ జనరల్ స్టోర్’లో రూ.28,500 విలువ చేసే 15 బస్తాలను పట్టుకున్నారు. ఇక కస్బా బజార్‌కు వెళ్లిన అధికారుల టీమ్‌కు.. అక్కడి ‘షేక్ జానీమియా రైస్ స్టోర్స్’లో రూ.7,500 విలువగల 5 బస్తాలు దొరకగా, అదే బజార్‌లోని ‘సుపీరియర్ ఎంటర్ప్రైజెస్’లో ఏకంగా రూ.42 వేల విలువైన 21 బియ్యం బస్తాలను పట్టుకుని సీజ్ చేశారు. ఇలా మొత్తం నాలుగు దుకాణాల్లో కలిపి ఏకంగా రూ.96 వేల విలువైన 53 బియ్యం బస్తాలను సీజ్ చేసినట్లు పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.
ఈ స్పెషల్ ఆపరేషన్ అనంతరం పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ అక్రమ వ్యాపారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బియ్యం బస్తాలపై ఎంత బరువు ముద్రించి ఉందో, పక్కాగా అంతే తూకంతో అమ్మకాలు జరపాలని, ఏమాత్రం తూకంలో తేడాలు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులకు సరైన పరిమాణంలో సరుకులు అందాల్సిందేనని, ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఈ స్పెషల్ డ్రైవ్ ఇక నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడకుండా, వినియోగదారులకు న్యాయం జరిగేలా అధికారుల తనిఖీలకు వ్యాపారులంతా సహకరించాలని ఆయన తేల్చిచెప్పారు.








