Mahaa Daily Exclusive

  ఆకాశం జిగేల్ అనేలా…  చరిత్రలో నిలిచిపోయేలా ప్రజాపాలన సంబురాలు..

Share

  • ట్యాంక్ బండ్‌పై డ్రోన్ షో.. లేజర్ షో
  • మురిసేలా ముగింపు
  • వినూత్న రీతిలో కార్నివాల్
  • ప్రభుత్వ పథకాలతో ప్రదర్శన.. ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్

 

హైదరాబాద్, మహా: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సందర్భంగా ప్రజాపాలన – ప్రజా వియోజత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఈ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించుకున్న మేరకు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఒక్కోరోజు ఒక్కో విధంగా కార్యక్రమాలను చేపట్టాలని షెడ్యూల్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం వియోజత్సవ వేడుకలను నిర్వహిస్తూ వస్తుంది. అయితే, విజయోత్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 9న ట్యాంక్ బండ్ పై అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఆరోజు ముందుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత కార్నివాల్, లేజర్ షో, డ్రోన్ షో, ఫైర్ వర్క్స్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాల్స్, సాంస్కృతి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనున్నది.

 

తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన నమూనాను విడుదల చేసింది. సామాన్య మహిళా రూపంలో తెలంగాణ తల్లి రూపంలో నమూనా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆకుపచ్చ చీరను ధరించి, మట్టి గాజులను ధరించిన చేతిలో వరికొయ్యలు, జొన్న, మొక్కజొన్న కంకులను చేత పట్టుకుని తెలగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ పోరాట స్ఫూర్తిని తెలిపేలా నూతన విగ్రహాన్ని రూపొందించారు. నగరం నడిబొడ్డున ఉన్న రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం లక్షల మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రజాపాలన ముగింపు వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో నిర్వహించే కార్నివాల్, లేజర్ షో, సాంస్కృతి కార్యక్రమాలు అలరించనున్నాయి. ఈ ఉత్సవాల ద్వారా మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి వంటి అనేక అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధిచిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది.

 

 

కార్నివాల్, లేజర్ షో

 

ప్రజలను అలరించేందుకు కార్నివాల్, లేజర్ షోలను నిర్వహిస్తుంటారు. కార్నివాల్, లేజర్ షో అనగా వినూత్న రీతిలో రంగురంగుల లైట్ల ప్రదర్శన ఉంటుంది. అందుకు అనుగూణంగా అలరించే మ్యూజిక్, గ్రాఫిక్, స్టోరీ టెల్లింగ్ ను అటాచ్ చేస్తారు. అత్యాధునిక విజువల్స్, వాటి ఉత్కంఠభరితమైన కలయికతో ఎంతో ఆకర్షణమైన వినోదాన్ని అందిస్తూ హైలెట్ గా నిలుస్తుంది. మొత్తంగా ఈ ప్రదర్శనలు మరిచిపోలేని అనుభూతితో వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ షోలను డిసెంబర్ 9న ముగింపు వేడుకల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రదర్శించనున్నారు. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను, కీలక నిర్ణయాలను, రాష్ట్ర ప్రగతిని, తెలంగాణ కీర్తి ప్రతిష్టలు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించనున్నారు. ప్రధానంగా ప్రభుత్వ 6 గ్యారెంటీలలో భాగంగా అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ కవరేజీని రూ. 10 లక్షలకు పెంపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల ఏర్పాటు తదితర పథకాలపై ఆకట్టుకునేలా కార్నివాల్, లేజర్ షో ప్రదర్శనలను నిర్వహించనున్నారు. దీంతో ట్యాంక్ బండ్ ప్రాంతమంతా ఆరోజు లైట్ల వెలుగులతో జిగేల్ జిగేల్ మననున్నది.

 

భారీ డ్రోన్‌ షో..

 

ముగింపు ఉత్సవాల్లో డ్రోన్ షోను కూడా నిర్వహించనున్నారు. భారీ సంఖ్యలో ఈ డ్రోన్లను ఆకాశానికి ఒకేసారి ఎగరవేస్తారు. వాటికి లైట్లను జోడించడంతో అవి రంగురంగుల వెలుగుల్లో కనిపిస్తాయి. భారీ సంఖ్యలో తాము ఏ విధంగా, ఏ రూపంలో కావాలనుకుంటే ఆ విధంగా ఈ డ్రోన్లను ప్రదర్శన చేస్తుంటారు. దీంతో అవి ఆకాశంలోకి ఎగిరిగా అందంగా కనిపిస్తాయి. ఈ డ్రోన్ ప్రదర్శనను చూస్తుంటే చీకటి సమయంలో ఆకాశంలో చుక్కలను చూస్తే ఎటువంటి ఫీలింగ్ కలుగుతుందో అదేవిధంగా డ్రోన్ ప్రదర్శన ఉంటుంది. ఈ డ్రోన్లన్నీ చుక్కల మాదిరిగా ఓ రూపంలో ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి. ఎయిర్ విమానాలు గాల్లో ప్రదర్శనలు చేసినట్టుగా అందంగా ఈ డ్రోన్ల షో ఉంటుంది. పక్షులు ఆకాశంలో పలు ఆకారాలలో వివహరిస్తున్నప్పుడు చూస్తే కలిగే అనుభూతి ఈ డ్రోన్ షో ద్వారా కలుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ప్రభుత్వ ప్రత్యేకత, ప్రముఖులకు సంబంధించిన రూపాలు వచ్చేలా డ్రోన్ల షో ద్వారా ఆకాశంలో ప్రదర్శన చేసి అలరించనున్నారు. కింద భాగాన హుస్సేన్ సాగర్ నది భాగం.. ఆకాశంలో డ్రోన్ల వెలుగులు.. ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం ఉండనున్నది. దీనిని నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహిస్తారు. అయితే, ఈ షో నిర్వహణ తెలంగాణలో మొదటిది కానున్నది. గతంలో ఇదివరకెప్పుడూ నిర్వహించలేదు.

 

ఫైర్ వర్క్స్….

 

కార్నివల్, లేజర్ షోతోపాటు ఫైర్ వర్క్స్ ను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైర్ వర్క్స్ అనగా తక్కువ పేలుడు శబ్ధంతో సౌందర్యం, వినోదం ప్రయోజనాల కోసం బాణాసంచాను వినూత్న రీతిలో పేల్చుతుంటారు. ఈ బాణాసంచ ప్రదర్శన కూడా వీక్షకులను ఎంతగానో అలరిస్తుంటాయి. ఒక రకంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తుంటది. ఈ ప్రదర్శనను కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుత రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. ముగింపు వేడుకల్లో కార్నివాల్, లేజర్ షో, డ్రోన్ షో, ఫైర్ వర్క్స్ తోపాటు ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాల్స్, సాంస్కృతి కార్యక్రమాలను తెలంగాణ సహజత్వం ఉట్టిపడేలా నిర్వహించనున్నారు. ఈ అన్ని ఏర్పాట్లను చూస్తుంటే ముగింపు వేడుకలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రత్యేక గుర్తింపు వస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.