Mahaa Daily Exclusive

  పైపులైన్ మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న

Share

 

కార్పొరేషన్, మహా ;

వరంగల్ దేశాయిపేట ప్రధాన ఫిల్టర్ బెడ్ నుంచి ఎంజీఎం ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీ కళాశాల, వరంగల్ డెయిరీతో పాటు కాకతీయ కాలనీ తదితర ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసే ప్రధాన పైపులైన్ మరమ్మతు, మార్పిడి పనులను వేగవంతంగా పూర్తి చేసి, నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.

మంగళవారం ములుగు రోడ్డు వద్ద కొనసాగుతున్న ప్రధాన పైపులైన్ మార్పిడి పనులను కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజాం కాలం నాటి సుదీర్ఘకాలంగా వినియోగంలో ఉన్న పాత పైపులైన్‌ లో ఏర్పడిన లీకేజీల కారణంగా మరమ్మతు పనుల్లో భాగంగా కొత్త పైపులైన్ ఏర్పాటు చేస్తున్న తీరును పరిశీలించి, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

ప్రత్యేకించి ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వంటి ప్రధాన వైద్య సంస్థలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎల్బీ కళాశాల, వరంగల్ డెయిరీ, కాకతీయ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలకు సైతం నీరు అందేలా త్వరతగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పైపులైన్ పనులు పూర్తయిన వెంటనే పరీక్షలు నిర్వహించి, తాగునీటి సరఫరాను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

నగర ప్రజలకు, ముఖ్యంగా ఆసుపత్రులకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించడంలో అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.

ఈ పర్యటనలో సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికుమార్, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.