Mahaa Daily Exclusive

  వడ్డేపల్లి బండ్‌పై ఫుడ్ స్ట్రీట్ పనులను త్వరగా పూర్తిచేయాలి…

Share

  • వడ్డేపల్లి బండ్‌పై ఫుడ్ స్ట్రీట్ పనులను త్వరగా పూర్తిచేయాలి
  • పారిశుద్ధ్య నిర్వహణను నిత్యం పర్యవేక్షించాలి
  • జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న

కార్పొరేషన్, మహా;

గ్రేటర్ వరంగల్ నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణను సంబంధిత అధికారులు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.
బుధవారం కమిషనర్ గ్రేటర్ వరంగల్ పరిధిలోని హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో పర్యటించి కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పూర్తయిన పనులు, పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

*ఫుడ్ స్ట్రీట్ పనుల పరిశీలన*

హనుమకొండలోని వడ్డేపల్లి బండ్‌పై చేపడుతున్న సుందరీకరణ పనులను కమిషనర్ పరిశీలించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఫుడ్ స్ట్రీట్ అందుబాటులోకి వస్తే నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆహార పదార్థాలను ఆస్వాదించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్బంగా హనుమకొండ బస్టాండ్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్ పారిశుద్ధ్య నిర్వహణను సమీక్షించారు. బస్టాండ్‌లోని మురుగు కాలువను పరిశీలించి, మురుగునీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం ఏనుమాముల మార్కెట్ సమీపంలోని బాలాజీ జంక్షన్ వద్ద పూర్తయిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

*వాటర్ ట్యాంక్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలి*

వరంగల్‌ లోని గోవిందరాజులగుట్ట ప్రాంతంలో నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను కమిషనర్ పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

*ఇంటి నుంచి చెత్త సేకరణ పక్కాగా జరగాలి*

అదే ప్రాంతంలో ఆకస్మికంగా స్వచ్ఛ ఆటోను తనిఖీ చేసిన కమిషనర్ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్న తీరును పరిశీలించారు. డ్రైవర్ నిర్వహిస్తున్న లాగ్‌బుక్‌ను తనిఖీ చేసి, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ వివరాలను నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.

ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజూ క్రమం తప్పకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, చెత్త సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. స్వచ్ఛ ఆటోల పనితీరు, లాగ్‌బుక్ నిర్వహణను శానిటరీ అధికారులు, సిబ్బంది నిత్యం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంజయ్ కుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, డీఈలు, ఏఈలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.