Mahaa Daily Exclusive

  ఆర్టీఐ ఫిర్యాదుపై రాష్ట్ర సమాచార కమిషన్ విచారణకు నోటీసులు !

Share

  • ఆర్టీఐ ఫిర్యాదుపై రాష్ట్ర సమాచార కమిషన్ విచారణకు నోటీసులు !
  • నవంబర్ 12న హైదరాబాద్‌లో విచారణ..
  • ఆర్డీఓ, నాయబ్ తహసీల్దార్ వ్యక్తిగత హాజరుకు ఆదేశం

పెద్దపల్లి జిల్లా,

కాల్వ శ్రీరాంపూర్,

సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోరిన సమాచారం అందించకపోవడంపై చేసిన ఫిర్యాదును తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ విచారణకు స్వీకరించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ నవంబర్ 12వ తేదీన ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మోట్లపల్లి గ్రామానికి చెందిన దొమ్మటి రవికిరణ్ 2025 ఆగస్టు 25న సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ కోరిన సమాచారం అందలేదని ప్రజా సమాచార అధికారులపై ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై 2026 నవంబర్ 3న కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదు నంబర్ 15358/SIC-AR/2026, అప్పీల్ నంబర్ 14697/SIC-AR/2025గా నమోదు చేసింది.

ఈ విచారణకు పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ), కాల్వ శ్రీరాంపూర్ నాయబ్ తహసీల్దార్ వ్యక్తిగతంగా హాజరుకావాలని కమిషన్ స్పష్టం చేసింది. ఆర్టీఐ దరఖాస్తుపై తీసుకున్న చర్యల వివరాలు, ఫిర్యాదుదారుడికి అందించిన సమాచారం ప్రతులు, సమాచారం పంపినట్లు ఆధారాలు, ఫిర్యాదుపై అంశాల వారీగా వివరణతో కూడిన అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.

అలాగే ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం నిర్వహించాల్సిన సమాచార వివరాలతో పాటు రిజిస్టర్-1, రిజిస్టర్-2లను కూడా విచారణ సమయంలో సమర్పించాలని సూచించింది. ఫిర్యాదుదారుడు సైతం తనకు అందని సమాచారం, అసంపూర్తిగా లేదా తప్పుగా అందించిన సమాచారానికి సంబంధించిన వివరాలతో అఫిడవిట్ సమర్పించి విచారణకు హాజరుకావాలని కమిషన్ పేర్కొంది.

అధికారుల హాజరుపై ఆసక్తి?

ఇదిలా ఉండగా, గతంలోనూ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన విచారణల్లో సంబంధిత అధికారి హాజరైన దాఖలాలు లేవని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారైనా రాష్ట్ర సమాచార కమిషన్ ఎదుట అధికారులు వ్యక్తిగతంగా హాజరవుతారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, కాల్వ శ్రీరాంపూర్ మండలానికి సంబంధించిన మరికొన్ని ఆర్టీఐ ఫిర్యాదులు సైతం రాష్ట్ర సమాచార కమిషన్ పరిధిలోకి వెళ్లినట్లు సమాచారం. అయితే వాటి వివరాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

నవంబర్ 12న జరిగే విచారణలో అధికారులు సమర్పించే వివరణలు, ఫిర్యాదుదారుడు అందించే ఆధారాల ఆధారంగా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విచారణతో మండలంలో సమాచార హక్కు చట్టం అమలు, అధికారుల జవాబుదారీతనంపై మరోసారి దృష్టి పడింది.