Mahaa Daily Exclusive

  మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం… కోర్టులో హాజరుపరచాలని సీపీకి ఆదేశం…..

Share

 

హైదరాబాద్, మహా : ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూ చౌదరిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం నాటి విచారణకు ఆయన హాజరుకాకపోవడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. దీంతో కలెక్టర్‌ను నేరుగా న్యాయస్థానంలో హాజరుపరచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌ను జడ్జి ఆదేశించారు. కాగా, కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన కేసులో ఇటీవలే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే. జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌పై కూడా తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించడం కలకలం రేపుతోంది. ఇది రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వరుసగా బ్యూరోక్రాట్లు న్యాయస్థానాల ఆగ్రహనికి గురికావడం ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయంజాల్‌లోని రెండు ప్లాట్‌లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పక్కనున్న ప్లాట్‌ల మాదిరిగానే తమవి నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ పి.శివలీల అనే మరొ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన హైకోర్టు.. 60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయినా, వీటిని అధికారులు అమలు చేయకపోవడంతో సదరు వ్యక్తులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. ఉద్దేశపూర్వకంగానే తమ ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ రంగారెడ్డి కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు.