Mahaa Daily Exclusive

  దావోస్ తరహాలో హైదరాబాద్ అభివృద్ధి….

Share

  • దావోస్ తరహాలో హైదరాబాద్ అభివృద్ధి
  • ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్
  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
  • ‘భారత్ సమ్మిట్’లో 70 దేశాల ప్రతినిధులు, రాహుల్ గాంధీ, ఖర్గే పాల్గొనున్నారని వెల్లడి

హైదరాబాద్‌, మహా : హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ రాజకీయ, సామాజిక, ఆర్థిక చర్చలకు మరో అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య, అహింస, ప్రగతిశీల భావజాలాన్ని విశ్వసించి ముందుకు సాగుతుందన్నారు. గత ఏడాది నిర్వహించిన భారత్ సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయిలో స్పందన, గుర్తింపు వచ్చిందని తెలిపారు. పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సన్నద్ధ సమావేశం బుధవారం ఉదయం నిర్వహించారు. గురువారం నుంచి శనివారం వరకు నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక భారత్ సమ్మిట్‌లో సుమారు 70 దేశాల నుంచి 1000 మంది ప్రతినిధులు పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్థిక రంగానికి స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరం ఎలాగో.. ప్రపంచ రాజకీయ, సామాజిక, ఆర్థిక చర్చలకు హైదరాబాద్ మరో కేంద్రంగా ఎదగాలని, అందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, శ్యామ్ పిట్రోడా సహా పలువురు ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొననున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య, ఉదారవాద, ప్రగతిశీల శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్ సమ్మిట్ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

దావోస్‌ను మించేలా హైదరాబాద్.. సల్మాన్ ఖుర్షిద్

హైదరాబాద్‌లో రెండోసారి అంతర్జాతీయ స్థాయి భారత్ సమ్మిట్ నిర్వహించడం వెనుక కాంగ్రెస్ అగ్రనేతల కృషి ఎంతో ఉందని విదేశాంగశాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ అన్నారు. గతేడాది హైదరాబాద్‌లో నిర్వహించిన సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభించిందన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని స్విట్జర్లాండ్‌లోని దావోస్ తరహాలో ఒక శాశ్వత గ్లోబల్ వేదికగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని సల్మాన్ ఖుర్షీద్ తప్పుపట్టారు. దివంగత మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు నిర్మించిన విలువలతో కూడిన విదేశాంగ విధానమే దేశానికి సరైన దిక్సూచి అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ ఆ అంతర్జాతీయ దృక్పథాన్ని మరోసారి ప్రపంచం ముందు ఉంచుతోందన్నారు.

బీజేపీ విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి లీడర్ అని, ఆయనను కొత్తగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రగతిశీల భావజాలంతో ముందుకు సాగుతోందని, బీజేపీ విధానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయన్నారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు లేవనెత్తిన పలు సమస్యలతో పాటు, ఎస్ఐఆర్ అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, వాటికి సంబంధించిన సరైన పరిష్కార మార్గాలపై చర్చలు జరగనున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.