- రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
- ఎరువుల కోసం రూ.62 వేల కోట్ల సబ్సిడీ
- రబీ సీజన్ లో రైతులకు తక్కువ ధరకే ఎరువులు
న్యూఢిల్లీ, మహా : రానున్న రబీ సీజన్లో రైతులకు ఎరువులు తక్కువ ధరలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 రబీ సీజన్‌కు సంబంధించి డీఏపీ సహా వివిధ రకాల ఎరువులపై సబ్సిడీ ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆరు నెలల కాలానికి ఎరువుల సబ్సిడీ కోసం రూ.62,370.02 కోట్లను కేటాయించారు. గత ఏడాది కంటే ఈసారి సుమారు రూ.24,418 కోట్లు అదనంగా కేటాయించడం విశేషం. దీంతో రబీ పంటలు సాగు చేసే రైతులకు ఎరువుల ధరల భారం కొంత తగ్గనుంది.
గత ఏడాది కంటే అదనంగా..
2026 అక్టోబర్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు రబీ సీజన్ కొనసాగుతుంది. ఈ ఆరు నెలల్లో రైతులకు అవసరమైన ఎరువులపై సబ్సిడీ అందించేందుకు కేంద్రం రూ.62,370.02 కోట్లను కేటాయించింది. గత 2025-26 రబీ సీజన్లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.37,952.29 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈసారి గత ఏడాదితో పోలిస్తే రూ.24,417.73 కోట్లు అదనంగా ఇచ్చారు. రైతులకు ఎరువులు కొరత లేకుండా, సరసమైన ధరలకు అందించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.
28 రకాల ఎరువులకు సబ్సిడీ
రైతులు పంటల సాగులో ఉపయోగించే డీఏపీ సహా మొత్తం 28 రకాల ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులకు కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. వీటిలో వివిధ రకాల ఎన్పీకేఎన్ ఎరువులు కూడా ఉన్నాయి. రానున్న రబీ సీజన్లోనూ ఈ సబ్సిడీ కొనసాగనుంది. అయితే ఈ డబ్బును ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయదు. ఎరువులు తయారు చేసే కంపెనీలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సంస్థలకు సబ్సిడీ ఇస్తుంది. ఆ కంపెనీలు రైతులకు తక్కువ ధరలకు ఎరువులను విక్రయించగలుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినా ఆ భారం రైతులపై పడదు.
పోషకాధారిత సబ్సిడీ అంటే ఏమిటి?
ఎరువులపై కేంద్రం ఇచ్చే సబ్సిడీని పోషకాధారిత సబ్సిడీ (ఎన్ బీఎస్) అంటారు. ఈ పథకాన్ని 2010 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నారు. మొక్కలు బాగా పెరగాలంటే కొన్ని రకాల పోషకాలు అవసరం. ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్ వంటి పోషకాలు ఎరువుల ద్వారా మొక్కలకు అందుతాయి. ఏ ఎరువులో ఎంత పోషకం ఉందో దాని ఆధారంగా కేంద్రం సబ్సిడీని నిర్ణయిస్తుంది. దీని వల్ల రైతులకు అవసరమైన ఎరువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి.







