- ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
- వాహన కాలుష్యంపై తీవ్ర ఆందోళన
- తక్షణ చర్యలు అవసరమని వ్యాఖ్య
- కాలం చెల్లిన, నిబంధనలకు విరుద్ధమైన వాహనాల నియంత్రణపై నివేదిక కోరిన ధర్మాసనం
- ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలకు రెండు వారాల గడువు
న్యూఢిల్లీ, మహా : ఢిల్లీ–ఎన్సీఆర్లో పెరుగుతున్న వాహన కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కాలం చెల్లిన, నిర్దేశిత ఉద్గార ప్రమాణాలను పాటించని వాహనాలు ఎన్సీఆర్లోకి ప్రవేశించకుండా, అక్కడ తిరగకుండా తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించాలని ఢిల్లీతో పాటు మూడు పొరుగు రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను రెండు వారాల్లోగా సమర్పించాలని సూచించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం నవంబర్ 6న ఢిల్లీ–ఎన్సీఆర్ వాయు కాలుష్యంపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాణిజ్య, ప్రైవేటు వాహనాల ప్రవేశం, రాకపోకలను నియంత్రించేందుకు అమల్లో ఉన్న నిబంధనలపై వివరాలు కోరింది. నిర్దేశిత ఉద్గార ప్రమాణాలను పాటించని వాహనాలను ఎలా గుర్తిస్తున్నారు? కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం (పీయూసీ) నిబంధనలను ఎలా అమలు చేస్తున్నారు? నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తనిఖీలు, చలాన్లు, ప్రవేశ నిరాకరణ వంటి చర్యల వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
రాష్ట్రాల మధ్య సమన్వయంపై ప్రశ్నలు
ఢిల్లీ–ఎన్సీఆర్లో స్థానికంగా తిరిగే వాహనాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చే వాహనాలు కూడా కాలుష్య భారాన్ని పెంచుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. అంతర్రాష్ట్ర వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల అధికారులు ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారో వివరించాలని కోరింది. ప్రస్తుత అమలు వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతిపాదిస్తున్న చర్యలు, వాటి అమలుకు నిర్దిష్ట గడువుతో కూడిన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని స్పష్టం చేసింది. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం), అమికస్ క్యూరీ చేసిన సూచనలపై తమ అభిప్రాయాలను కూడా తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
పంట వ్యర్థాల దహనం తగ్గినా.. వాహన కాలుష్యంపై ఆందోళన
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లో పంట వ్యర్థాల దహనం ఘటనలు గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. అయితే అదే సమయంలో వాహనాల నుంచి వెలువడే కాలుష్యంపై ఆందోళనలు పెరుగుతున్నాయని పేర్కొంది. పంట వ్యర్థాల దహనం తగ్గడం అభినందనీయమే అయినప్పటికీ.. వాహన కాలుష్యం మరో తీవ్రమైన సమస్యగా ముందుకొస్తోందని వ్యాఖ్యానించింది. ఈ సమస్యపై తక్షణ, అత్యవసర చర్యలు అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 23వ తేదీకి వాయిదా వేసింది.







