- ఉలిక్కి పడ్డ జమ్మూకశఅమీర్
- కుల్గాం సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి.
- ముగ్గురు జవాన్లకు గాయాలు
- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
జమ్మూ, మహా : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) శిబిరంపై బుధవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్లను హుటాహుటిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉగ్రదాడి నేపథ్యంలో ఆ ప్రాంతంతో భారీ బలగాలను మోహరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం మధ్యాహ్నం సుమారు 2:15 గంటల ప్రాంతంలో మోటార్ సైకిళ్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులిద్దరు, చెక్‌పాయింట్ వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా, నిందితులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని చికిత్స కోసం అనంతనాగ్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు 46వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన సిబ్బందిగా తెలుస్తోంది. “కశ్మీర్‌లోని కుల్గామ్‌లో సీఆర్పీఎఫ్ నాకా వద్ద కాల్పులు జరిగాయి. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశాం. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం” అని సీఆర్పీఎఫ్ ప్రతినిధి తెలిపారు.
ఉగ్రదాడి అనంతరం ఘటనా స్థలంలో అదనపు బారికేడ్లు ఏర్పాటు చేసి, సాయుధ వాహనాలతో భారీగా బలగాలను మోహరించారు. క్విక్ రియాక్షన్ టీమ్‌తో కలిసి క్యాంప్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. స్థానికులు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు లౌడ్‌స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అటు ఈ ఉగ్రదాడి జరిగిన సమయంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కుల్గామ్ జిల్లాలోనే పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటిస్తున్న ప్రాంతానికి దాడి జరిగిన స్థలం దూరంగా ఉందని అధికారులు తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో కత్రాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతివాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.








