Mahaa Daily Exclusive

  విద్యార్థులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్……

విద్యార్థులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.
* బాలురకు ఇంటర్ వరకు, బాలికలకు డిగ్రీ వరకు ఉచిత ప్రయాణం!
* 150 కిలోమీటర్ల పరిధిలో నెలవారీ టికెట్ ఉచితం.
* రెండో తరగతి రైళ్లలోనే అవకాశం

న్యూఢిల్లీ, మహా.

చదువుల కోసం ప్రతిరోజూ రైళ్లలో ప్రయాణించే విద్యార్థులకు భారతీయ రైల్వే శాఖ అందిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇంటి నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రత్యేక నెలవారీ సీజన్ టికెట్ (ఎంఎస్‌టీ) సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ నిబంధనల ప్రకారం బాలురు 12వ తరగతి వరకు, బాలికలు డిగ్రీ పూర్తయ్యే వరకు ఉచితంగా రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయం అందరికీ వర్తించే సాధారణ ఉచిత ప్రయాణ పథకం కాదు. విద్యార్హత, ప్రయాణ దూరం, రైలు రకం వంటి నిర్దిష్ట నిబంధనలకు లోబడి మాత్రమే ఈ వెసులుబాటు లభిస్తుంది.

బాలికలకు బీటెక్‌, ఎంబీబీఎస్‌ కోర్సులకూ వర్తింపు.

ఈ ఉచిత ప్రయాణ సదుపాయం బాలికలకు సాధారణ డిగ్రీ కోర్సులకే పరిమితం కాలేదు. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు బీటెక్‌, బీఈ, ఎంబీబీఎస్‌, బీబీఏ, బీసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే వారికి కూడా డిగ్రీ స్థాయి వరకు వర్తిస్తుంది. 2011 జూన్ 14న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సదుపాయాన్ని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులు చదివే బాలికలకు విస్తరించింది.

150 కిలోమీటర్ల వరకు ప్రయాణం ఉచితం.

విద్యార్థులు తమ నివాస ప్రాంతానికి సంబంధించిన రైల్వే స్టేషన్ నుంచి పాఠశాల లేదా కళాశాలకు సమీపంలోని స్టేషన్ వరకు ప్రయాణించేందుకు ఈ టికెట్ ఉపయోగించుకోవచ్చు. గరిష్ఠంగా 150 కిలోమీటర్ల దూరం వరకు ఉచిత నెలవారీ సీజన్ టికెట్ జారీ చేస్తారు. ఈ సదుపాయం రెండో తరగతికి మాత్రమే వర్తిస్తుంది. సాధారణ ప్యాసింజర్, లోకల్ రైళ్లలో ప్రయాణించవచ్చు. మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ఈ ఉచిత టికెట్‌తో ప్రయాణించడానికి అనుమతి లేదు. నెలవారీ టికెట్ మాత్రమే ఇస్తారు. మూడు నెలల సీజన్ టికెట్ ఉచితంగా జారీ చేయరు.

ఉచిత టికెట్ ఎలా పొందాలి?

ఈ సదుపాయం పొందాలనుకునే విద్యార్థులు సమీపంలోని రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్‌ను సంప్రదించాలి. పాఠశాల లేదా కళాశాల నుంచి పొందిన బోనఫైడ్ ధ్రువీకరణ పత్రం, విద్యార్థి గుర్తింపు కార్డు, ఫొటో, ప్రయాణించే స్టేషన్ల వివరాలు సమర్పించాలి. రైల్వే అధికారులు విద్యార్థి అర్హతను పరిశీలించిన తర్వాత నిబంధనల ప్రకారం ఉచిత నెలవారీ సీజన్ టికెట్ జారీ చేస్తారు.

ఇతర విద్యార్థులకూ ప్రయాణ రాయితీలు.

ఉచిత నెలవారీ టికెట్‌కు అర్హత లేని ఇతర విద్యార్థులకు కూడా రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. స్వగ్రామాలకు వెళ్లేందుకు, విద్యా పర్యటనలకు సాధారణ కేటగిరీ విద్యార్థులకు రెండో తరగతి, స్లీపర్ తరగతుల్లో 50 శాతం రాయితీ ఉండగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 75 శాతం రాయితీ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏడాదికి ఒకసారి విద్యా పర్యటనకు వెళ్లేందుకు రెండో తరగతి టికెట్‌పై 75 శాతం రాయితీ పొందవచ్చు. అదే పాఠశాలల్లో చదివే బాలికలు జాతీయ స్థాయి వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేందుకు కూడా 75 శాతం రాయితీ పొందే అవకాశం ఉంది. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రధాన రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు రెండో తరగతిలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు.

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థుల చదువుకు ప్రయాణ ఖర్చులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా రోజూ దూర ప్రాంతాల నుంచి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే బాలురకు 12వ తరగతి వరకు, బాలికలకు డిగ్రీ వరకు మాత్రమే ఉచిత టికెట్ అర్హత ఉంటుందని, 150 కిలోమీటర్ల దూర పరిమితి, రెండో తరగతి ప్రయాణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share