Mahaa Daily Exclusive

  ‘ప్రజావాణి’ ఆగదు..

Share

  • ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నాం
  • ఎన్ని ఇబ్బందులొచ్చినా నిరంతరంగా కొనసాగుతుంది
  • ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
  • – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 

హైదరాబాద్, మహా: ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆగబోదని, ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగుతుందని రాష్ట్ర డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రజావాణి ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజావాణితో లబ్ధి పొందినవారితో ఆయన నేరుగా ముచ్చటించారు. తమ సమస్యలు పరిష్కారమయ్యాయంటూ వారు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన మరికొంతమంది తమ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కొక్కరిగా వారి సమస్యలను ఓపికగా వింటూ పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి వారికి భరోసా ఇచ్చారు. ఆ దిశగా ముందుకు వెళ్లాలంటే అక్కడే సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని ఆయన అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి వస్తే పరిష్కారం దొరుకుతుందని ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేయడంతో సమస్య పరిష్కారం అయిందంటూ ప్రజలు చెబుతుండడం ప్రజా ప్రభుత్వానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమం మరింతగా ముందుకు వెళ్లాలనే బలమైన ఆలోచనతో తమ ప్రభుత్వం ఉందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. లక్ష్యాలు నెరవేరకపోగా రాష్ట్రం అభివృద్ధిలో వెనుకపడిపోయిందన్నారు. సామాన్యులు నోరు తెరిచి తమ సమస్యలను చెప్పుకోకుండా, సమస్యలపై ప్రజలు ప్రశ్నించకుండా పాలనను తమ గుప్పిట్లో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ కారణంగానే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే తీసుకున్న మంచి నిర్ణయం ప్రజావాణి. ఈ కార్యక్రమాన్ని ఏదో పేరుకు మాత్రమే కాకుండా ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తున్నాం. వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్ లైన్ లో వెంటనే సంబంధిత అధికారికి వెళ్లేలా, ఆ సమస్య పరిష్కారమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఆ విధంగా ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఇక్కడికి వచ్చి తమ సమస్యలు పరిష్కారమయ్యాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సంతోషాన్ని బట్టి చూస్తుంటే వారి అభిప్రాయం మేరకు ప్రభుత్వం ముందుకు పోతుందనే విషయం స్పష్టంగా అర్థమైతుంది. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేవిధంగా పాలన ఉండాలనే విధానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది ప్రజాపాలన అనే భావన కలుగుతుంది. ప్రభుత్వంలోని అన్ని శాఖలు కూడా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాయి. భారత రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలను ప్రజలకు అందిస్తున్నాం. ఏదిఏమైనా కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదు. ప్రజావాణితో ప్రజలకు నిరంతరం నమ్మకం కలిగిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజల అవసరం మేరకు విద్యుత్ సరఫరా అయ్యేలా కృషి చేస్తాం. ఫారెస్ట్ రైట్ యాక్ట్ ద్వారా పట్టాలు పొందిన పోడు రైతులు సాగు చేసుకునేందుకు సోలార్ ద్వారా కరెంట్ ను అందిస్తాం. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును ముందుగా పరిశీలిస్తున్నాం. ఆ తరువాత ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరిస్తున్నాం. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య దేవరాజన్ తోపాటు అధికారులు పాల్గొన్నారు.