Mahaa Daily Exclusive

  మోహన్ బాబు ఇంటివద్ద నాటకీయపరిణామాలు..

Share

  • జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి.. ఉద్రిక్తత
  • మనోజ్ గుండెలమీద తన్నావురా అంటూ మోహన్ బాబు ఎమోషనల్ ఆడియో రిలీజ్
  • రోడ్డునపడ్డ మంచు కుటుంబం.. మోహన్ బాబుపై జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం
  • నోటీసులు జారీచేసిన రాచకొండ సిపి
  • జర్నలిస్టులపై దాడిని ఖండించిన మంత్రి పొంగులేటి
  • మోహన్ బాబును అరెస్ట్ చేయాలి- తీన్మార్ మల్లన్న డిమాండ్

 

హైదరాబాద్, మహా

 

సినీనటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు ఇంటి వద్ద ఉదయం నుండీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నారు. అటు విష్ణు, ఇటు మనోజ్ బౌన్సర్లు.. దాడులు, పోలీసులకు పరస్పర ఫిర్యాదులు వెరసి అంతా గందరగోళంగా మారింది. మరోవైపు మంచు మనోజ్, మౌనికలను మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ అడ్డుకుని గేట్లు వేయడంతో.. వారిద్దరూ గేట్లను బద్దలు కొట్టి మరీ లోనికి ప్రవేశించే ప్రయత్నం చేయగా.. సెక్యూరిటీతో మనోజ్ వాగ్వాదానికి దిగారు. విష్ణు తరపు బౌన్సర్లు మనోజ్ దంపతులను అడ్డుకోగా.. పోలీసులు ఆ బౌన్సర్లను బయటికి పంపించేసినట్లుగా తెలుస్తోంది. ఈలోపు ఈ ఘటనను కవరేజ్ చేస్తున్న మీడియాపై ఒక్కసారిగా మంచు మోహన్ బాబు విరుచుకుపడ్డారు. కొన్ని కెమెరాలను ధ్వంసం చేశారు. అంతేకాదు, మనోజ్ పై కూడా ఆయన దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా మోహన్ బాబు ఇంటి వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. మోహన్ బాబు విచక్షణారహితంగా చేసిన దాడితో.. ఆ ప్రదేశంలోని చాలా మంది గాయపడినట్లుగా సమాచారం. మంచు మనోజ్ గేట్లు తన్నుకుంటూ లోపలికి వెళ్లగా.. అతని వెంట మీడియా కూడా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లింది. అయితే ఓ విలేఖరి దగ్గర మైక్ లాక్కున్న మోహన్ బాబు.. ఆ విలేఖరిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. పైగా ఆ విలేఖరి అయ్యప్ప మాలలో ఉన్నారు. అయ్యప్ప మాలలో ఉన్న విలేఖరిపై దాడి.. ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇది మరింతగా రచ్చ అయ్యే అవకాశం లేకపోలేదు. మరోవైపు ‘‘నా పిల్లలకి..నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ప్రైవేట్ కంప్లయింట్ వేస్తాను.. మీరు న్యాయంగా చెయ్యండి.. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయ్.. కానిస్టేబుల్స్ మా సెక్యూరిటీని పంపించేశారు..’’ అంటూ మౌనిక మాట్లాడుతోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా మంచు ఫ్యామిలీలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేయడంతో పాటు జర్నలిస్టులపై దాడిచేయగా, తర్వాత అస్వస్థతకు గురికావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్ళారు.

 

మనోజ్ గుండెలమీద తన్నావురా- మోహన్ బాబు ఎమోషనల్ ఆడియో

 

మంచు మనోజ్ చేష్టలపై ఆయన తండ్రి మోహన్ బాబు పంపిన ఒక వాయిస్ మెసేజ్ వైరల్ అవుతోంది. మనోజ్ నీ వల్ల మీ అమ్మ హాస్పిటల్ పాలయింది. మనోజు నీకన్ని ఇచ్చినా..‌ నాకు అపఖ్యాతి అపకీర్తి తీసుకువచ్చావు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. అవి నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాట విని.. తాగుడుకి అలవాటు పడ్డావు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే పరిస్థితికి తీసుకువచ్చావు. కులం, మతం తేడా లేకుండా మనం విద్యను అందిస్తున్నాము. మన దగ్గర చదువుకున్నవారు ఎంతో మంది గొప్పవారు అయ్యారురా. నువ్వు అక్కడే చదువుకున్నావు.. నటుడి అయ్యావు. తాగుడికి అలవాటు పడి నువ్వు, నీ భార్య ఇంట్లో బిహేవ్ చేసే విధానం నీచం. భగవంతుడు చూస్తున్నాడురా.. ఎవరు తప్పు చేస్తున్నారనేది. అందరికీ మాట్లాడుకునేందుకు ఎంత అవకాశం ఇచ్చాం. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావ్..ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్లని కొడుతున్నావ్. వారిని కొట్టడం మహా పాపం రా‌. నేను దండించటం వేరు. మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో కొడతాడు తిడతాడనేది ఉండొచ్చేమో.. కానీ ఇంట్లో నువ్వు చిన్న పిల్లలను కొట్టిన దానికి చనిపోయేవాడు. అందుకే నువ్వు, నీ భార్య పూర్తిగా మారి బయట ఉండమని చెప్పాను‌. ఎన్నో సార్లు తప్పు చేసావ్. మూడు రోజుల నుంచి వస్తున్న వార్తలు ఎంతో ఆవేదన కలిగించాయి. మనోజ్ నన్ను కొట్టలేదు, మేమిద్దరం ఘర్షణ పడ్డాం. నా ఇంట్లోకి నువ్వే అక్రమంగా చొరబడ్డావ్, నా మనుషులను కొట్టావ్. నాకు రక్షణ కావాలని పోలీసులను కోరాను. నీ కూతురును వచ్చి తీసుకెళ్లు, నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదు. పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తా..’’ అని మోహన్ బాబు పంపిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో ఎమోషనల్ గా మోహన్ బాబు మనోజ్ కు అప్పీల్ చేశారు. జర్నలిస్టులకు కూడా అప్పీల్ చేశారు. తన ఇంటి సమస్య సమసిపోతుందని, రోడ్డునపడేయవద్దని కోరాడు.

 

మోహన్ బాబుకు సిపి నోటీసులు.. భగ్గుమన్న జర్నలిస్టు సంఘాలు

 

మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేయగా, జర్నలిస్ట్ లు మోహన్ బాబుపై చర్య కోరుతూ ఆందోళనకు దిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు కు రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు జారీచేశారు. బుధవారం ఉదయం విచారణకు రావాలని కోరారు.

 

స్పందించిన మంత్రి పొంగులేటి

జల్ పల్లి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేయడాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖండించారు. చట్ట ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. మోహన్ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు.