- దిల్ రాజు ఆధ్వర్యంలో కలవనున్న నిర్మాతలు, నటులు
- అల్లు కుటుంబం కూడా కలిసే అవకాశం
- సంధ్య వివాదానికి తెర.. చిత్రపరిశ్రమ సమస్యలపై చర్చ
హైదరాబాద్, మహా
ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల సమావేశం గురువారం జరగనుంది. సీఎంతో తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధిపైఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. భేటీకి సంబంధించి ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు ఇప్పటికే ప్రకటించారు. ‘సీఎంతో భేటీపై హీరోలు, నిర్మాతలకు సమాచారం ఇస్తున్నా’ అని దిల్రాజు తెలిపారు. సినిమా మనిషిగా చిత్రపరిశ్రమకు వారధిగా ఉంటాననే తనను ఎఫ్డీసీ ఛైర్మన్గా నియమించారని దిల్రాజు తెలిపారు.
రూ.2కోట్ల సాయం అందజేసిన పుష్ప-2 టీమ్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్ల పరిహారాన్ని అందజేస్తున్నామని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను నిర్మాత దిల్ రాజుతో కలిసి పరామర్శించిన అనంతరం పరిహారాన్ని అల్లు అరవింద్ ప్రకటించారు. హీరో అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, పుష్ప-2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత చెక్కులను ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందజేశారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్రాజు, పుష్ప-2 నిర్మాత రవిశంకర్తో అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాలుడు తండ్రి బాస్కర్తో అల్లు అరవింద్ మాట్లాడారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పరిహారం వివరాలను వెల్లడించారు.
ఎఫ్డీసీ తరఫున
బాబు వేగంగా కోలుకుంటున్నాడని పరిహారం సొమ్ము సద్వినియోగం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు సీఎంతో సీనీ ప్రముఖులు భేటీ కానున్నారని వివరించారు. కాగా గురువారం భేటీతో సినీపరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య తలెత్తే వివాదాలు పూర్తిగా సమసిపోనుండగా, వారధి లాంటి వ్యవస్థ కూడా ఏర్పడనుంది.
…….





