Mahaa Daily Exclusive

  బెలగావి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు..

Share

  • రాష్ట్రం నుంచి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
  • తెలంగాణ ప్రజా ప్రభుత్వ విధానాలపై రేవంత్ ప్రసంగం

 

న్యూఢిల్లీ, మహా :కాంగ్రెస్ పార్టీకి జాతిపిత మహాత్మా గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వేదికపై ఈ సారి సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. గురు, శుక్రవారాలలో కర్ణాటకలోని బెలగావి వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కానుంది. నవ్ సత్యాగ్రహ బైఠక్ అని నామకరణం చేసిన ఈ సమావేశాలకు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీడబ్ల్యూసీ దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీడబ్ల్యుసీ సభ్యులు చల్లా వంశీచందర్ రెడ్డి తదితరులు వెళ్తున్నారు. ఉదయం హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో బెల్గాం వెళ్ళనున్న కాంగ్రెస్ నాయకులుబర్ 27వ తేదీ ఉదయం 11.30 గంటలకు జై బాపు, జై బీమ్, జై సంవిధాన్ పేరిట ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ ర్యాలీకి ఏఐసీసీ సభ్యులతోపాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఇక 27వ తేదిన మధ్యాహ్నం 2.30 గంటలకు మహాత్మాగాంధీ నగర్‌లో ఈ సీడబ్ల్యుసీ సమావేశానికి 200 మంది శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు సైతం హాజరవుతారు. 1924, డిసెంబర్ 26వ తేదీన మహాత్మా గాంధీ నేతృత్వంలో కర్ణాటకలోని బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించారు. వందేళ్ళ అనంతరం అదే స్ఫూర్తితో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిచడం పార్టీలో నూతనోత్సహాన్ని నింపేందుకు దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖలతోపాటు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగా ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా సైతం దక్కించుకొంది. దీంతో భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసే అవకాశాలున్నాయి. అధికార ఎన్డీయేను ఎలా ఎదుర్కోవాలి, ఢిల్లీ అసెంబ్లీలో ఒంటరిగా బరిలో దిగుతోన్న వేళ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై ఈ సందర్భంగా పార్టీ నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు తదితర రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై పార్టీ చర్చించే అవకాశాలున్నాయి. తెలంగాణతో సహా కర్నాటక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలు, ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజల నుంచి వస్తున్న స్పందన తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చకు వచ్చే అఇవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి ప్రతినిధులుగా వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశ నేతలకు తెలియజేసే అవకాశాలున్నాయి.

 

కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయ్యాలని.. అలాగే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలాంటి వేళ పార్లమెంట్‌లో రెండు రోజుల పాటు దీనిపై చర్చను ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని పిలవడం ఫ్యాషన్ అయిపోయిందంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. అన్ని సార్లు దేవుడి పేరు తలిస్తే స్వర్గ లోకం సంప్రాప్తిస్తోందంటూ ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి. ఆ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల దాడితోపాటు నిరసనలు సైతం చేపట్టారు. అంబేద్కర్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న దోరణిని రదేశ ప్రజలకు తెలియజెప్పే క్రమంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై సమావేశం ఒక నిర్ణయానికి రానుంది.

Latest