హైదరాబాద్, మహా : పాలమూరు ప్రాజెక్టుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు కోసం జైపాల్ రెడ్డి చేసింది ఏముందని ప్రశ్నించారు. కావాలంటే, నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులకు జైపాల్ రెడ్డి పేరు పెట్టుకోవాలని సూచించారు. పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు మా నాన్న నర్సిరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని డీకే అరుణ గుర్తు చేశారు. చిట్టెం నర్సిరెడ్డి పేరు ప్రభుత్వానికి గుర్తుకురాలేదా? అని నిలదీసిన ఎంపీ అరుణ సీఎం రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియకపోయినా, మా నాన్న సేవలు సీనియర్ మంత్రులకు గుర్తులేవా అని ప్రశ్నించారు. జిల్లా కోసం మా నాన్న, సోదరుడు ప్రాణాలు అర్పించారన్నారు. మహూబ్ నగర్ ప్రాంత అభివృద్ధికి తన తండ్రి నర్సిరెడ్డి చివరి ఊపిరి వరకు తహతహలాడారని, అలాంటి నేతను విస్మరించి బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయడం దారుణమన్నారు. తన తండ్రి, సోదరుడు ప్రజా సేవలో ఉంటూనే ప్రాణాలను అర్పించారని, అలాంటి నేతను విస్మరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరును పాలమూరు ప్రాజెక్చులకు కాకుండా నల్గొండ ప్రాజెక్టులకు పెట్టి నర్సిరెడ్డి పేరును పెట్టాలని డిమాండ్ చేశారు.







