హైదరాబాద్,మహా: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కందుకూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన పెద్దోళ్ల ప్రశాంత్ రెడ్డి శరీర అవయవాలను కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో దానం చేశారు. తమ కుటుంబ సభ్యుడు ఇక లేరనే బాధలో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న ఇతర ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చారు. డిసెంబర్ 28 వ తేదీన డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రి పది గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీకొనగా తలకు బలమైన గాయాలు తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం మలక్ పేట యశోద ఆసుపత్రి తీసుకెళ్ళగా చికిత్స పొందుచూ శనివారం మరణించారు.
ప్రశాంత్ రెడ్డి అవయవాలను తండ్రి రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి, భార్య సౌమ్య జీవన్ దాన్ కు కిడ్నీలు, కాలేయం అప్పగించారు. తమ బిడ్డ ప్రాణం పోయిన బాధను తమ గుండెల్లో దాచుకుని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావడాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ఐపిఎస్ అభినందించారు. మృతుని కుటుంబాన్ని శాఖాపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఆర్గాన్ డొనేషన్ చేసిన వారు భౌతికంగా మరణించినప్పటికి జీవించి ఉన్నట్లేనని, అవయవదానం ద్వారా మరొక మనిషికి ప్రాణం పోయడం ఎంతో గొప్ప విషయం అని కమిషనర్ పేర్కొన్నారు. ఉప్పల్ లో ఆదివారం జరిగిన కానిస్టేబుల్ ప్రశాంత్ రెడ్డి అంత్యక్రియల ఖర్చులకు కమిషనర్ గారు 90 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ గారి తరపున మహేశ్వరం ఏసిపి లక్మికాంత రెడ్డి హాజరై ప్రశాంత్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కందుకూరు ఇన్స్పెక్టర్ సీతారాం, రాచకొండ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్ భద్రారెడ్డి, రాచకొండ కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ సువర్ణ, బ్యాచ్ మెట్స్ తదితరులు పాల్గొన్నారు.







