Mahaa Daily Exclusive

  ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పోలిటిక్స్- కేంద్ర మంత్రి బండి సంజయ్

Share

ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పోలిటిక్స్…

ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ గురువు కేసీఆర్…

ఆయన బాటలోనే రేవంత్ ప్రభుత్వం

ఫాంహౌజ్ లో పడుకునే కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు

కాంగ్రెస్ సర్కార్ వల్లే మితిమీరి పోతున్న ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, మహా : ఇచ్చిన హామీలపై ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ను మించి పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతినెలా ఏదో అంశంపై ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు తలమీదకు వస్తుండటంతో… కొత్తగా రైతు భరోసా పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12 వేల చొప్పున మూడు దఫాలుగా రూ.18 వేల రూపాయలు బకాయిపడ్డారని చెప్పారు. ఈ లెక్కన 70 లక్షల మంది రైతులకు రూ.19 వేల 600 కోట్ల రూపాయలు బకాయి పడ్డారని తెలిపారు. ఈ డబ్బులన్నీ జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అట్లాగే నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.48 వేలు, మహిళలకు రూ.30 వేల చొప్పున దాదాపు రూ.50 వేల కోట్లు రేవంత్ ప్రభుత్వం బకాయి పడిందన్నారు. వృద్దులకు రూ.4 వేలు, పేదలకు ఇండ్ల జాగా, రూ.5 లక్షలు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు పేరుతో లక్ష కోట్లకుపైగా బకాయి పడిందన్నారు. ఈ సొమ్ముంతా జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? రేవంత్ సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పదేళ్లలో మోదీ సారథ్యంలో గడ్కరీ ఆశీస్సులతో రోడ్ల విస్తరణ కోసం లక్ష కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. తెలంగాణలో ఏ మూలకు పోవాలన్నా రెండు గంటల్లో వెళ్లే అవకాశం ఏర్పడిందంటే అది మోదీ గారి ఘనతే అన్నారు, రూ.18 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్ ను కేంద్రమే నిర్మిస్తుందన్నారు. గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఐఎఫ్ నిధుల ద్వారా మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. రైల్వేల అభివృద్ధి విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణకు నిధులు కేటాయిస్తూ పరుగులు పెట్టిస్తున్నామని, పదేళ్లలో 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. ఈ ఒక్క ఏడాదిలో రైల్వే బడ్జెట్ లోనే రూ.5 వేల 336 వేల కోట్లు తెలంగాణకు కేటాయించామని చెప్పారు. 720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దుతున్నామని, 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారుస్తున్నామన్నారు. సోమవారం చర్లపల్లి కొత్త టెర్మినల్ ను వర్చువల్ గా ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించబోతున్నారన్నారు. ఈ స్టేషన్ నుంచి రెగ్యులర్ గా 24 ట్రైయిన్స్ రాకపోకలు సాగించబోతున్నాయని పేర్కొన్నారు.

మోదీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పొలిటిక్స్ చేస్తూ ప్రజలను దగా చేస్తోందని సంజయ్ విరుచుకుపడ్డారు. 70 ఏళ్లుగా దేశాన్ని అబద్దపు మాటలతో, మోసపు హామీలతోనే మోసం చేసిందని, ఇప్పుడు కూడా 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎగ్గొట్టి ఏడాది అయిందన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ కు గురువు కేసీఆరే అని ఆయన బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నందున రైతు భరోసా, రేషన్ కార్డులంటూ కొత్త డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తామన్నరు. ఏమైంది? అమలు చేస్తారా? లేదా? స్పష్టం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.

ఇచ్చిన మాటకు కట్టుబడ్డ కేసీఆర్

కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఓడిపోయి ఫాంహౌజ్ కు పరిమితమయ్యారని సంజయ్ వ్యంగ్యంగా అన్నారు. ఫాంహౌజ్ కే పరిమితమైతే మరి ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఎందుకు తీసుకోవాలని నిలదీశారు. ఆ పదవికి రాజీనామా చేసి ఇంట్లో ఉండాలన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత స్పందించకపోతే, పోరాడకపోతే ఫలితమేమిటని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఆయన చనిపోతే కూడా వెళ్లక పోవడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీలో సంతాప తీర్మానం పెడుతున్నం..రమ్మని పిలిచినా స్పందించలేదని, అసలు చేతగాని నీకు ప్రతిపక్ష పదవి ఎందుకు? ఆ పదవిని హరీష్ రావుకు ఇవ్వు. బీసీలకు ఇవ్వాలనుకుంటే గంగులకో, తలసాని శ్రీనివాస్ యాదవ్ కో ఇవ్వాలని శలహా ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులివ్వడం లేదని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్దమా? ఇదే అంశంపై ఎన్నికలకు పోదామా? గ్రామాల వారీగా ఏ పథకానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చంది? రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో ప్రజల్లోకి వెళదామా? అని సవాల్ చేశారు.

Latest