గత సంవత్సరం జూన్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కర్నూలు కార్పొరేషన్ లో టీడీపీ బలం పెంచుకునే దిశగా మంత్రి టీజీ భరత్ పావులు కదుపుతున్నారు. వైసీపీ పార్టీని కూకటి వేర్లతో పెకిలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో కూటమి పార్టీలకు కౌన్సిల్ లో వారి బలం 9 నుండి 20 కు చేరుకుంది. అదనంగా ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు కౌన్సిల్ లో ఓటు హక్కు కలిగి ఉంటారు. సంక్రాంతి తరువాత అవిశ్వాస తీర్మాణం పెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది వైస్సార్ సీపీ కార్పొరేటర్లు పక్క చూపులు చూస్తున్నారు. పాత బస్తీలోని టీడీపీకి చెందిన ఓ కార్పోరేటర్ ఇదే పనిలో ఉన్నారనీ, ఇప్పటికే ఐదుగురు టచ్ లోకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
కాగా, కర్నూలు కార్పొరేషన్ లో కర్నూలు, పాణ్యం, కోడుమూరు అర్భన్ నియోజకవర్గాలు ఉన్నాయి. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 38 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇక్కడ వైసీపీ పార్టీకి అధినాయకుల దిక్కులేదు. పట్టించుకునే వారు లేరు. ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ల మధ్య వర్గ పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ఈ క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవీ బాధ్యతలను ఎస్వీమోహన్ రెడ్డికి కట్టబెట్టడంతో పాతబస్తీకి చెందిన పలువురు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల తరువాత నియోజకవర్గంలో హఫీజ్ ఖాన్ కనిపించడంలేదని స్థానికులు చెబుతున్నారు. ఆయన హైదరాబాద్, అమెరికాలో ఎక్కువగా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. పార్టీ అధిష్టానం ఎస్వీకే మొగ్గు చూపడంతో ఆయన అసంతృప్తితోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయంశమైంది.
రాజీనామా చేసిన కర్నూలు ఇంచార్జ్
కర్నూలు నియోజకవర్గ పార్టీ ఇంచార్జీగా ఉన్న ఇంతియాజ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కర్నూలు నగరంలో వైసీపీ పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయింది. ఇదే అదనుగా భావించిన
పలువురు వైసీపీ కార్పొరేటర్లు పచ్చ కండువా కప్పుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి టీజీ భరత్ బిజీగా ఉండటంతో ప్రయత్నాలు వాయిదా పడుతూ ఉన్నాయి. ఈనెల 10 తరువాత రాజకీయ పరిణామాలు వేడెక్కనున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
42 వార్డు ఎన్నికకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ వార్డులో అత్యధికంగా ఏపీఎస్పీ క్యాంపు ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. సీతారామ నగర్, రాజీవ నగర్ తదితర కాలనీలు ఉన్నాయి. ఇవన్నీ అత్యధికంగా టీజీ భరత్ కు అనుకూలంగా ఉన్న కేడర్ ఉంది. వ్యాపార వర్గాలు వార్డు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏదిఏమైనప్పటికీ సంక్రాంతి తరువాత కర్నూలు కార్పొరేషన్ కూటమి కైవసం చేసుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది.






