ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ. 18 వేల వేతనం నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆశ వర్కర్ల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ల ముందు ధర్నా పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే (క్యాంప్ ఆఫీస్) ప్రజా భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అందుబాటులో లేకపోవడంతో గేటుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా సహాయ కార్యదర్శి బ్రహ్మయ్య మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా గ్రామాల్లో ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం లేదన్నారు. గర్భిణీలు, బాలింతలు, షుగర్, బిపి వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్య సహాయం చేస్తున్న ఆశా వర్కర్లకు ఎలాంటి ఆదేరువు లేదన్నారు. ఆశాలు గతంలో చేసిన పోరాటాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆశాలకు ఫిక్స్డ్ వేత్తనం రూ. 18,000 లు హామీని అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉన్న ఆశాలకు ఫిక్స్డ్ వేతనానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. అధికారానికొచ్చి సంవత్సరం గడుస్తున్నా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఆశలకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. గతంలో రూ. 50 లక్షల ఇన్స్యూరెన్స్ ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాభవన్ కు వెళ్తే అక్కడ అందుబాటులో ఎవరూ లేకపోవడం బాధాకరమన్నారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18000లు నిర్ణయించి, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు బుగ్గరాములు, సీహెచ్ బుగ్గరాములు, చందు నాయక్, ఎల్లేశ, యాదగిరి, ఆశా వర్కర్స్ మన్నెమ్మ, సుకన్య, లావణ్య, నాగమణి, చంద్రకళ, మరియమ్మ, విజయ, సరూప, శోభ, యాదమ్మ, అలివేలు, జంగమ్మ, భాగ్య, సునీత, రాణి తదితరులు పాల్గొన్నారు








