ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ లో బిజీబిజీగా చర్చలు జరుపుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త్ లక్ష్మీ మిత్తల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రాంమోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేశ్, భరత్, అధికారులు భేటీ అయ్యారు. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు లోకేశ్ అహ్వానించారు. అదేవిధంగా ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంటును కూడా ఏర్పాటు విషయమై పరిశీలించాని కోరారు. ఇందుకోసం అక్కడ స్థిరమైన సదుపాయాలు ఉన్నాయని, ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని వారికి వివరించారు. ప్లాంటును ఏర్పాటు చేస్తే 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం లక్ష్మీమిత్తల్ మాట్లాడుతూ.. ఆర్సెలాల్ మిత్తల్, జపాన్ కు చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టును ఏర్పాటు ప్రక్రియను ఏపీలో ప్రారంభించామంటూ గుర్తుచేశారు. అనకాపల్లి దగ్గరలో రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టును ఉపయోగించి 975 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఆర్సెలార్ మిత్తల్ భారత్ లో గ్రీన్ కో గ్రూప్ తో భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అనకాపల్లిలో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్ కు నిరంతరాయ పునరుత్పాదక విద్యుత్ ను సరఫరా చేస్తుందన్నారు. లక్ష్మీ మిత్తల్ తో భేటీ అనంతరం ఎక్స్ లో సీఎం చంద్రబాబు పోస్ట్ పెట్టారు. అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలాల్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ప్లాంట్ అతిపెద్ద ప్రాజెక్టు అని, ఇది అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా దావోస్ కాంగ్రెస్ సెంటర్ ప్లీనరీ హాల్ లాబీలో జరిగిన నెట్ వర్కింగ్ డిన్నర్ కు ఏపీ ప్రతినిధుల బృందం హాజరయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు.







