రాష్ట్రంలో మాజీ సర్పంచులంతా పెండింగ్ బిల్లులు రాక అల్లాడుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్దం చేశారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆవేదనను అర్ధం చేసుకుని వెంటనే ఆ బిల్లులను చెల్లించి వేలాది మంది సర్పంచులను ఆదుకోవాలని కోరారు. జెండాలను, ఎజెండాలను, బేషజాలను పక్కనపెట్టి అభివృద్దే లక్ష్యంగా పని చేద్దామని సూచించారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలందిస్తోందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో రూ. 3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాలు, షాపింగ్ కాంప్లెక్స్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, అభివ్రుద్ధే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నామని, కొట్లాడుకునే జమానా పోయిందన్నారు. గతంలో ఏ అభివృద్ది కార్యక్రమానికి తనను పిలవలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, తెలంగాణలో 30 లక్షల మంది రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. యూరియా కొరత లేకుండా చేస్తున్నామని, ఎరువుల మీద ఇప్పటి వరకు దాదాపు రూ.30 వేల కోట్ల రూపాయల సబ్సిడీని తెలంగాణ రైతులకు అందించిన ఘనత మోదీదేనని పేర్కొన్నారు. ఒక్కో యూరియా బస్తా మీద రూ. 2,236 లు సబ్సిడీ ఇస్తున్నామని, రామగుండంలో యూరియా పరిశ్రమ ఏర్పాటు చేసి ఎరువుల కొరత అనేది లేకుండా చేశామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 12వేల 769 మంది తాజా మాజీ సర్పంచులున్నారని, వారికి దాదాపు 13 వందల కోట్ల రూపాయలు బిల్లులు రావాల్సి ఉందన్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు ఒక్కో సర్పంచుకు 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా పల్లె ప్రగతి,.రైతు వేదిక, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, హరిత వనం, కమ్యూనిటీ హాల్,.హైమాస్ లైట్స్, అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు వంటి కార్యక్రమాలన్నీ కళ్ల ముందే కన్పిస్తున్నాయని, ఇవన్నీ జరిగాయంటే అది తాజా మాజీ సర్పంచులవల్లేనని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో అభివ్రుద్ది పనులన్నా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిధులను విడుదల చేయడంవల్లే సాధ్యమైందన్నారు. కానీ చేసిన పనులకు సంబంధించి బిల్లులివ్వకుండా మాజీ సర్పంచులను వేధించడం సరికాదన్నారు. వాళ్లను బాధను అర్ధం చేసుకుని వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మానకొండూరు స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గతంలో గన్నేరు వరం బేగంపేట రోడ్డు నిర్మించాలన్నారు, అది సాంక్షన్ కాగానే ఇప్పుడు గన్నేరువరంపై బ్రిడ్జి నిర్మించాలని కోరారంటూ తప్పకుండా ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు. ఎన్నికల తరువాత అభివ్రుద్ధే ఎజెండా. నాకైనా ఓట్లేసింది ప్రజలే. కవ్వంపల్లి సత్యనారాయణకైనా, గెలిచిన బీఆర్ఎస్ నేతలకైనా ఓట్లేసింది ప్రజలే.కాబట్టి అందరం కలిసి ప్రజల కోసమే పనిచేసి వారి సమస్యలను పరిష్కరించాలన్నది నా ఉద్దేశమన్నారు. ఎలాంటి బేషజాలు లేకుండా పనిచేద్దామన్నారు.







