స్థానిక ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పథకాల జాతరతో గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికపుడు అంచనా వేస్తూనే కీలకమైన ఎన్నికల దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో రాగా, ఇదే ఊపులో పంచాయతీని కూడా ముగించేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటోంది. స్థానిక రిజర్వేషన్లకు, కులగణన సర్వేకు ముడివేసిన ప్రభుత్వం కులగణన నివేదికకు ఆమోదముద్ర వేయాలని డిసైడ్ అయింది. ఫిబ్రవరి 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుండగా, కేబినెట్ మీటింగ్ లో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. భేటీలో కుల గణన సర్వే రిపోర్టుపై చర్చించి ఆమోద ముద్రం వేయనుంది. అలాగే ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి కులగణన నివేదికపై సభలో చర్చించి అనంతరం అసెంబ్లీ ఆమోద ముద్ర వేయనుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసర్వేను ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ నివేదికను రెడీ చేశారు. ఈ తుది నివేదికను అధికారులు ఫిబ్రవరి 2వ తారీఖున కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు. కులగణ సర్వే నివేదికపై మంత్రి వర్గ సబ్ కమిటీ చర్చించి తుది నివేదకను ఆమోదం కోసం కేబినేట్‌కు సమర్పించనుంది. ఫిబ్రవరి 5న కేబినెట్ ప్రత్యేక భేటీలో దీని గురించి చర్చించనున్నారు. కులగణన నివేదికపై సభలో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
కోడ్ లో కోడ్..
గతంలో కేసీఆర్ కూడా లోక్ సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉన్నపుడే స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తిచేశారు. ఇక జిహెచ్ ఎంసి ఎన్నికల సమయంలోనైతే నామినేషన్లకు కూడా సమయం ఇవ్వకుండా రెండురోజుల్లోనే ఈ క్రతువు ముగించారు. ఇపుడు పంచాయతీ ఎన్నికలను దశలవారీగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే కార్యాచరణను సిద్దం చేస్తోంది.
తొలిదశ అక్కడే
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్నాయి. ఆ మూడు జిల్లాల్లోనే ఏడుగురు మంత్రులు ఉన్నారు. 34మందిలో 32మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారే. ఇక ఎమ్మెల్సీలు, ఎంపీలన్నీ కాంగ్రెస్పే. ఇలాంటిచోట రాజకీయాలకు అతీతంగా నిర్వహించే తొలిదశ పూర్తిచేసి ఆ తర్వాత రెండోదశకు వెళ్ళే ప్లాన్ లో కాంగ్రెస్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మూడు విడతలుగా ఈ ఎన్నికలను పూర్తిచేసే ఆలోచనలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉండడంతో అభ్యర్ధుల విషయంలో ఏకాభిప్రాయం సాధించలేక.. గెలిచినోడే మన పార్టీ అన్నట్లుగా వ్యవహారం ఉండేది. ఇపుడు అధికారపార్టీకి టికెట్ల కేటాయింపు సాహసమే అయినా ఇతరత్రా పదవుల్లో సర్దుబాటు చేసేందుకు వీలుగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ విజయాలతో మిగతా జిల్లాల్లో వార్ వన్ సైడ్ అనేలా.. ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తారన్న టాక్ వినబడుతోంది.







