తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. దేశంలోనే మొదటిసారి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని తమ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతోందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ఏడాదికి రెండు ఖరీదైన చీరలు
రాష్ట్రంలో మహిళా శక్తి 67 లక్షల మంది ఉన్నారని తెలిపారు. 600 ఆర్టీసీ బస్సులకూ మహిళలను యజమానులను చేశామని గుర్తుచేశారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చామన్నారు. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నామని ప్రకటించారు. సొంత ఆడబిడ్డలకు అందించినట్లు నాణ్యమైన చీరలను అందించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
పాఠశాలలపై ప్రత్యేక దృష్టి..
రూరల్, అర్బన్ అనే తేడా లేదు.. తెలంగాణలో మహిళలంతా ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుందామని తెలిపారు. మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. నిధులు తాము ఇస్తాం.. నిర్వహణ మీరు చేయాలని అన్నారు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. నిధులు మేం ఇస్తాం..నిర్వహణ మీరు చేయండి. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడులను కూడా అలాగే నిర్వహించుకోవాలి’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.







