డేటా సెంటర్ల హబ్‌గా భారత్!
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌తో భారీగా పెరిగిన డిమాండ్.
* ఆసక్తికర విషయాలు వెల్లడించిన గోల్డ్‌మన్ శాక్స్, నైట్ ఫ్రాంక్ నివేదికలు.
ముంబయి, మహా.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా నిల్వ అవసరాలు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. భారత డేటా సెంటర్ రంగం భారీ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం ‘గోల్డ్‌మన్ శాక్స్’ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. ‘ఔట్‌లుక్ ఫర్ డేటా సెంటర్స్ ఇన్ ఆసియా’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. భారత్ తన డేటా సెంటర్ మార్కెట్‌ను అత్యంత వేగంగా విస్తరించడానికి అనువైన పరిస్థితులతో పూర్తి సిద్ధంగా ఉంది. దేశంలో ఉన్న అపారమైన యువత, అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ, పశ్చిమాసియా దేశాలకు దగ్గరగా ఉండే వ్యూహాత్మక భౌగోళిక స్థానం భారత్‌కు అతిపెద్ద సానుకూల అంశాలుగా మారాయి.
ఏఐలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలు (హైపర్‌స్కేలర్లు), లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో ఆసియాలోనే ఈ రంగం వృద్ధి రేటు వేగంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో 2025 నుంచి 2028 వరకు చైనాలో డేటా సెంటర్ల డిమాండ్ ఏటా 20 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతుందని అంచనా వేసిన గోల్డ్‌మన్ శాక్స్, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్, జపాన్, ఫిలిప్పీన్స్‌లను అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్లుగా గుర్తించింది.
**ఐదు రెట్లు పెరగనున్న సామర్థ్యం**
ఈ డిజిటల్ రేసులో భారత్ ఏ స్థాయిలో దూసుకుపోతోందో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’ కూడా ఇటీవల ఆసక్తికర గణాంకాలను వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో లైవ్‌లో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం కేవలం 1.6 గిగావాట్లు మాత్రమే కాగా.. రాబోయే రోజుల్లో ఇది ఏకంగా ఐదు రెట్లు పెరిగి 8.33 గిగావాట్లకు చేరుకోవడానికి అవసరమైన ప్రాజెక్ట్ పైప్‌లైన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. దేశంలో పెరుగుతున్న ఏఐ అడాప్షన్, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వాడకం, డేటాను దేశీయంగానే భద్రపరచాలనే ప్రభుత్వ నిబంధనలు (డేటా లోకలైజేషన్) ఈ భారీ డిమాండ్‌కు ప్రధాన కారణాలని విశ్లేషించింది. ప్రస్తుతం దేశంలో 0.32 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ల నిర్మాణం వేగంగా జరుగుతుండగా, మరో 2.92 గిగావాట్ల ప్రాజెక్టులు చర్చల దశలు దాటి నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అదనంగా మరో 5.41 గిగావాట్ల ప్రాజెక్టులు డిజైన్ దశలో ఉండటం విశేషం.
**2030 నాటికి 500 బిలియన్ డాలర్ల మార్కెట్**
కార్నెల్ యూనివర్శిటీ పరిశోధనల ప్రకారం.. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 21 లక్షల కోట్లు)గా ఉన్న డేటా సెంటర్ మార్కెట్ విలువ, 2030 నాటికి ఏకంగా రెట్టింపు అయి 500 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి హైపర్‌స్కేలర్ సంస్థల విస్తరణ ప్రణాళికలు, కార్పొరేట్ కంపెనీలలో ఎంటర్‌ప్రైజ్ ఏఐ వాడకం అమాంతం పెరగడం, హై-ఎండ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) మౌలిక సదుపాయాలకు ఉన్న డిమాండ్, పాత ఐటీ సిస్టమ్స్‌ను ఆధునీకరించడం వంటి ప్రధాన అంశాలు ఈ అసాధారణ వృద్ధిని నడిపిస్తున్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.






