పదేళ్లు కృష్ణా జలాల అంశంపై బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు మౌనం వహించి ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని, ప్రజలు సైతం నమ్మరని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. కృష్ణా జలాలపై తెలంగాణ- ఏపీ మధ్య జరుగుతున్న చర్చలు.. దానిపై కేంద్రం స్పందనపై ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి మూల కారణాలైన వాటిలో నీళ్ళ పంపకం ఒకటి అన్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కోదండరాం మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం..
కృష్ణా జలాల నీటి వివాదంపై గత పదేళ్ళు అధికారంలో ఉండి కూడా మాట మాట్లాడని బీఆర్ఎస్ నేతలు.. ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి తాము పోరాటం చేస్తామని ముందుకు రావడం హాస్యాస్పదమన్నారు. గత పదేళ్లలో మీరు మౌనం వహించడం వల్లే.. ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, టీజేఎస్ తరపున గట్టిగానే నిలదీస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీజేఎస్ మద్ధతు కోరిందని కోదండరాం తెలియజేశారు.
లింగమూర్తి హంతకులను కఠినంగా శిక్షించాలి..
సామాజిక వేత్త రాజాలింగమూర్తి హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఘటన వెనుక ఎవరు ఉన్నా తప్పక శిక్షించాలని కోదండరాం కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గా పోటీ చేస్తున్న పల్నాల గోపాల్ రెడ్డి, అశోక్ కుమార్ లకు టీజేఎస్ మద్దతు తెలుపుతున్నామని ఎమ్మెల్సీ కోదండరాం ప్రకటించారు







