Mahaa Daily Exclusive

  భయమా.. వ్యూహమా…?

Share

ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రమే అధికారపార్టీ ఎందుకు పోటీచేస్తోంది? ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రభావం చూపుతున్న అంశాలేంటి? రాజకీయవర్గాల్లో ఈ అంశాలపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలున్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడం ఆశ్చర్యకరమే. ఇప్పటికీ ఉత్తర తెలంగాణలో పట్టభద్రులు బిఆర్ఎస్ కు అనుకూలంగా లేరన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉందా? ఓవైపు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని స్వయంగా చెబుతున్న కేసీఆర్ ఈ ఎన్నికల్లో పాల్గొనకపోవడం ద్వారా ఎవరి గ్రాఫ్ బాగుందని చెప్పదలుచుకున్నారు? ఎమ్మెల్సీ ఎన్నికల విధానానికి వ్యతిరేకమైతే ఇటీవల వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పోటీచేసింది. బీఆర్ఎస్ ఓటమి నుండి ఇంకా తేరుకోలేదా? వ్యూహాల్లో తడబడుతుందా? అన్నదానిపై విశ్లేషణలు సాగుతున్నాయి.

– తాజా రాజకీయ పరిణామాలపై ఎఎన్ఎన్ సిఈవో, జర్నలిస్ట్
కంది రామచంద్రారెడ్డి వీకెండ్ ఎనాలసిస్
తెలంగాణలో ఓవైపు ఎన్ని కల రాజకీయాలు, మరోవైపు కులగణన ఎత్తులు సాగుతున్నాయి. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు మరో నాలుగురోజుల్లో ఎన్నిక జరగనుంది. ప్రచారం తుదిదశకు చేరింది. మూడు ఎన్నికల్లో అత్యంత ఆకర్షించేది కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. నాలుగు జిల్లాల పరిధిలోని ఈ స్థానం నుండి పోటీలో లేకుండా తప్పుకుంది బీఆర్ఎస్. ఇపుడు పోటీ కాంగ్రెస్, బిజెపి మధ్యే. అధికారపార్టీ అభ్యర్ధి పై సహజంగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తాయి. ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. మొత్తం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలోని ఓట్లలో 45శాతం కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ జిల్లాకు చెందిన విద్యావేత్తనే ఎంపిక చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయించేది కరీంనగరే. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిరాష్ట్రంలో 8 స్థానాలు సాధించినా కరీంనగర్ నుండి ఒక్క సీటు కూడా గెలవలేదు. ప్రస్తుతం బిజెపి గ్రాడ్యుయేట్ స్థానానికి నిలిపిన అభ్యర్ధి కరీంనగర్ కు చెందిన నేత కాదు. కరీంనగర్ లో ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డి చుట్టే చర్చ జరుగుతున్నది. అది నెగిటివ్ అయినా సరే.. చర్చలో ఉన్న అభ్యర్ధి ఆయనే. బిజెపి నుండి సంగారెడ్డి జిల్లాకు చెందిన అంజిరెడ్డి బరిలో ఉన్నాడు. బిజెపి ఏ ఎన్నిక అయినా.. గెలిచేదయినా, ఓడేదైనా పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహిస్తుంది. గల్లీ నుండి ఢిల్లీ దాకా లీడర్లు ప్రచారం చేస్తుంటారు. దీర్ఘకాలిక వ్యూహాలతో బిజెపి ఎపుడూ సాగుతుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే తరహాలో కొత్త ఓటుబ్యాంకు ప్రోదిచేసుకునేందుకు పనిచేస్తోంది. ప్రజలు ఎన్నిక ఎన్నికకూ చాలా తెలివిగా తీర్పును ఇస్తుంటారు. గ్రాడ్యుయేట్లకు తమమీద కోపం తగ్గలేదనే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీచేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్లగొండ-ఖమ్మం, వరంగల్ పట్టభద్ర ఎన్నికల్లో పోటీచేసిన బిఆర్ఎస్ ఇపుడు మాత్రం పోటీకి దూరంగా ఉంది. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవిత నియోజకవర్గాలన్నీ ఈ స్థానం పరిధిలోనే ఉన్నా బిఆర్ఎస్ పోటీచేయకపోవడం గ్రౌండ్ అనుకూలంగా లేదనే. మాజీ ఎంపీ వినోద్ రావు కూడా.. ఇటీవల తెలంగాణవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పోటీకి దూరంగా ఉన్న కారణం వివరించారు. బిజెపి పరిస్థితి భిన్నం. గెలిచినా ఓడినా ఓటుబ్యాంకు విస్తరణ వ్యూహాలతో పోటీచేస్తూనే ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒకసారి హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుండి బిజెపి అభ్యర్ధి ఎన్. రామచందర్ రావు టిడిపి పొత్తులో గెలిచారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ స్థానంలో బిజెపి గెలిచింది లేదు.
…..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను పార్టీపరంగా మొదట లైట్ తీసుకున్నా.. ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ యాక్టివ్ అయింది. నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగగా, టీపీసీసీ చీఫ్ తో పాటు మంత్రులంతా పనిచేస్తున్నారు. సిట్టింగ్ స్థానం నిలుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. అభ్యర్ధులలో అందరికంటే ముందుగా ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి ముందుగా ప్రచారం ప్రారంభించారు. ఓటర్ల చేరికలోనూ ప్రత్యూక వ్యూహంతో వ్యవహరించారు. ఇపుడు పార్టీ శక్తి కూడా తోడవడంతో బలమైన అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నపుడు, అదీ ఎన్నికల్లో పోటీచేసినపుడు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోకతప్పదు. ఫైనల్ గా ఓటర్లు వివేచనతోనే తీర్పునిస్తారు. భావోద్వేగాలకు, ప్రచార పటాటోపానికి లొంగరు. వాటి ప్రభావం చాలా స్వల్పం. వరంగల్, నల్లగొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రస్తుతం యుటిఎఫ్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ ఇతర సంఘాలు కూడా బలంగా ఉన్నాయి.

……
బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయానికి రాలేకపోతుంది. ఎదురులేని ప్రధాని ఉన్నా, కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలోనే ఏడాది క్రితమే హామీనిచ్చినా.. ఇంకా తెలంగాణ రాష్ట్ర పగ్గాల విషయంలో దాటవేత ధోరణి అనుసరించడం వ్యూహమా? భయమా? వారికే తెలియాలి. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఓ వైపు కేంద్రమంత్రి, మరోవైపు రాష్ట్ర అధ్యక్ష పదవి రెండూ కిషన్ రెడ్డి ఒక్కరికే అప్పగించడం బిజెపికి తెలంగాణ లో ఇతర నాయకులపై ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది. బిజెపి రాష్ట్ర పదవి ఇచ్చినా, కేంద్రమంత్రి పదవులు, గవర్నర్ పదవులు ఏవి ఇచ్చినా అవి హైదరాబాద్, కరీంనగర్ నేతలను దాటి ఇతరులకు రావు. చరిత్ర దీనిని స్పష్టం చేస్తున్నది. ప్రస్తుత కేంద్ర పదవులు గానీ, రాష్ట్ర పగ్గాలు గానీ వీటికి అద్దం పడుతాయి. కరీంనగర్ లో లేదా, హైదరాబాద్ లో రాజాసింగ్ కాకుండా ఇతరులు ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఉంటే బిజెఎల్పీ పదవి కూడా ఇక్కడే ఇచ్చేవారు. ఇదంతా బిజెపి నేతలందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సమస్యలు, హద్దులు పెట్టుకుని బిజెపి విస్తరణపై, అధికారంపై మాట్లాడడం వెనుక లోతుపాతులు ఆ నేతలకే తెలుసు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పిసిసి చీఫ్ ను నియమించి ఐదుమాసాలైనా ఇంకా కార్యవర్గాన్ని కూడా ఏర్పాటుచేసుకోలేకపోతోంది. స్వయంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ ఛార్జి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి మరీ కమిటీలు ఏర్పాటుచేయండి.. క్యాడర్ లో జోష్ నింపండి అంటూ ఆదేశాలు ఇచ్చిన నేతలు ఎప్పటిమాదిరే ఏదో ఒక కారణం చెబుతూ కాలం గడుపుతున్నారు.
..
కేసీఆర్ ఏడుమాసాల తర్వాత తెలంగాణభవన్ కు వచ్చి మళ్ళీ పాత లెక్కలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎపుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల మీటింగ్ లు పెట్టినా అధికారం గురించి, సర్వేలు, గ్రాఫ్ ల గురించే మాట్లాడుతారు. ఇది అందరికీ తెలిసిందే. ఈసారి కూడా మళ్ళీ అధికారం మనదే. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంటూ మళ్ళీ చెప్పారు. అయితే గ్రాఫ్ బాగున్న పార్టీ తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడం లేదంటే బాగుందో.. బాగాలేదో వారే చెప్పాలి. బిసి కులగణనతో దేశంలో ఫస్ట్ తామేనని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ దీనిని జాతీయ స్థాయి చర్చకు తీసుకువెళ్ళాలని డిసైడైంది. అయితే బిసి కులగణన, రిజర్వేషన్లకు చట్టబద్దత రావడం అంత తేలికైన విషయం కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో పార్టీ ఒక్కో స్థానం గెలిస్తే రాజకీయాలు ఎప్పటిలాగే ఉంటాయి. అన్ని స్థానాలు బిజెపి చెబుతున్నట్లుగా లభిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.