దాదాపు పద్నాలుగేళ్ళ తర్వాత తెలుగునటులకు ప్రభుత్వం అవార్డులు ఇస్తుండడం అభినందనీయమని, గద్దర్ సినిమా అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం గొప్ప విషయమని అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్, ప్రముఖ సినీనటి జయసుధ అన్నారు. మంగళవారం ఎఎన్ఎన్ – మహా తో ప్రత్యేకంగా మాట్లాడారు. జ్యూరీ ఛైర్మన్ గా తనను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్ రెడ్డి, దిల్ రాజులకు ధన్యవాదాలు తెలిపారు. అవార్డుల కోసం ఎంట్రీలు భారీగా వచ్చాయని, అన్ని సినిమాలు బాగానే ఉంటాయన్నారు. అన్ని రకాలు ఎంట్రీలు 1172 వచ్చాయని, వీటికి వేర్వేరు కమిటీలు దిల్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారన్నారు. తాను 76 సినిమాలు చూస్తానని, నెలరోజుల్లో ఇవి పూర్తిచేస్తామన్నారు. జ్యూరీలో ఎంతోమంది అనుభవజ్ఞులు, మంచి వారిని, గొప్పవారిని పెట్టారన్నారు. సినిమా పండుగ అద్భుతంగా జరుగుతుందని భావిస్తున్నానన్నారు.








