జొన్నగిరిలో పసిడి వెలుగులు.
* ఏపీలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ప్రారంభం.
* ఏటా వెయ్యి కిలోల పసిడి ఉత్పత్తిే లక్ష్యం.
కర్నూలు, మహా
భారతదేశ పసిడి ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ నవశకానికి నాంది పలికింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేపట్టిన అత్యంత భారీ ప్రైవేట్ బంగారు గనుల ప్రాజెక్టు కర్నూలు జిల్లా జొన్నగిరిలో లాంఛనంగా ప్రారంభమైంది. జొన్నగిరి గ్రామంలో భారీగా ఉన్న బంగారు నిక్షేపాల వెలికితీత పనులు అధికారికంగా ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టుతో దేశీయ బంగారు ఉత్పత్తిలో ఏపీ అత్యంత కీలక రాష్ట్రంగా అవతరించనుంది.
జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుమారు రూ.400 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో ఈ ‘జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్’ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సుమారు 598 హెక్టార్ల సువిశాల విస్తీర్ణంలో ఓపెన్-పిట్ మైనింగ్ పద్ధతిలో ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. కేవలం జొన్నగిరి ప్రాంతంలోనే దాదాపు 50 టన్నుల భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకుంటే, రాబోయే 15 ఏళ్ల పాటు ఏటా వెయ్యి కిలోల (ఒక టన్ను) అత్యుత్తమ నాణ్యత కలిగిన శుద్ధి చేసిన బంగారాన్ని దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ప్రస్తుతం ఏటా 800 టన్నులకు పైగా బంగారాన్ని వినియోగిస్తుండగా, దానికి తగినట్లుగా దేశీయ ఉత్పత్తి ఏమాత్రం లేదు. ప్రఖ్యాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) 2000వ సంవత్సరంలోనే మూతపడగా.. ప్రస్తుతం కర్ణాటకలోని హుట్టి గనుల నుంచి ఏటా కేవలం 1.5 టన్నుల పసిడి మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో జొన్నగిరి ప్రాజెక్టు దేశీయ పసిడి ఉత్పత్తికి పెద్ద ఊతమివ్వనుంది. ఇక్కడ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి టన్ను ముడి ఖనిజం నుంచి సుమారు ఒక గ్రాము బంగారాన్ని వెలికితీయనున్నారు.
జొన్నగిరితో పాటు రాష్ట్రంలోని రామగిరి, జవ్వాకుల, చిగురుకుంట-బిస్నాతం తదితర ప్రాంతాల్లోనూ ఇప్పటికే అధికారులు బంగారు నిక్షేపాలను గుర్తించారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో పట్టాలెక్కితే విదేశాల నుంచి బంగారం దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గనుందని, తద్వారా ఖనిజ రంగంలో భారతదేశం స్వావలంబన దిశగా పయనించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.








