జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ” పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని” మోహన్ భగవత్ అన్నారు. అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.








