రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూర్ శివారులోని రావినారాయణ రెడ్డి కాలనీ సమీపంలో ఉన్న గుడిసెలలో శనివారం మధ్యాహ్నం వేళ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది.రావినారాయణరెడ్డికాలనీలోని సుమారు 100ఎకరాల భూదాన్ భూమిలో సిపిఐ ఆధ్వర్యంలో పేదలు 8వేల గుడిసెలు వేసుకొని, కూలీ పనులు చేసుకుంటూ వేలాది మంది నివసిస్తున్నారు. బతుకుదెరువు కోసం కూలీ పనులకు వెళ్లగా,శనివారం మధ్యాహ్న సమయంలో ప్రమాదవశాస్తు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. వందలాది గుడిసెలు క్షణల్లో కాలి బూడిదయ్యాయి. గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుడిసెలన్నీ పక్కపక్కనే ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించారు. సుమారు 500 గుడిసెలు కాలిపోయాయి. కూలీలు పనులకు వెళ్లడంతో ప్రాణ నష్టం జరగలేదు. గుడిసెలు కాలిపోవడంతో అనేక మంది పేదలు నిరాశ్రయులయ్యారు. సమాచారం అందుకున్న హయత్ నగర్ అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రమాదంతో పేదలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. అగ్నిప్రమాదంలో నగదు, దుస్తులు, వంటసామగ్రి, పిల్లల పుస్తకాలు కాలి బూడిదయ్యాయి.చాలా మంది నిరాశ్రయులుగా మారారు. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీ కాశిరెడ్డి, సరూర్ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ సీఐలు సైదిరెడ్డి, శ్రీనివాస్, నాగరాజుగౌడ్, అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది వచ్చి, పరిస్థితిని అడుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హయత్ నగర్ సీఐ నాగరాజుగౌడ్ తొలిపారు.
– జాగ కోసం ఏండ్లకు ఏండ్లు ఎదురుచూపు
కుంట్లూరు రెవెన్యూ పరిధిలోని రావినారాయణరెడ్డి కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు వేల మంది పేదలు గుడిసెలు వేసుకుని, ఇంటి జాగ కోసం నాలుగేండ్లుగా ఎదురు చూస్తున్నారు. పాలకులు తమను కరుణిస్తారని వేలాది మంది పేదలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను ఆదుకుని, ఇంటి జాగ ఇవ్వాలని పేదలు కోరుతున్నారు.
– ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు, నాయకులు
రావినారాయణరెడ్డి కాలనీలో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం తెలుసుకున్న పోలీసుల ఉన్నతాధికారులు, రాజకీయ పార్టీల నాయకులు ప్రమాదాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఒక గుడిసెలో దేవుడి దగ్గర పెట్టిన దీపం గుడిసెకు అంటుకుని, మంటలు చెలరేగాయని, గుడిసులన్నీ పకపక్కనే ఉండడంతోపాటు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు వచ్చాయని ప్రాథమిక అంచానకు వచ్చినట్లు తెలిపారు. జరిగిన ప్రమాదం దురదృష్టకరమని, అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
– అగ్నిప్రమాదంపై విచారణ చేయించాలి
-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
రావినారాయణరెడ్డి కాలనీ అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, జరిగిన ప్రమాదం విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఆందోజు రవీంద్రాచారీ డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రమాదవశాస్తు జరిగిందా? లేదా ఏదైనా కుట్ర కోణం ఉందా? అని సందేహం వ్యక్తం చేస్తూ పోలీసులు పూర్తిస్థాయి విచారణ, దర్యాప్తు చేపట్టాలని కోరారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే పేదలు రోడ్డున పడ్డాడని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని పేదలకు ఇవ్వాలని కోరారు.
గ్యాస్ సిలిండర్ లు పేలడంతో పరుగులు తీసిన జనం.
ఘటన స్థలం వద్ద అగ్నిప్రమాదం సమయంలో గుడిసెలలో వంట కోసం ఏర్పాటు చేసుకున్న గ్యాస్ సిలిండర్ లు బ్లాస్ట్ అయ్యాయి.దీంతో మంటలను ఆర్పేందుకు కూడా స్థానికులు భయాందోళనకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు.








