అశ్వారావుపేట, ఏప్రిల్ 28, మహా: భూ భారతి చట్టంలో ప్రతి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఇది నాలుగు గోడల మధ్య తయారుచేసిన స్వార్థపూరిత చట్టం కాదని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన భూ భారతి-2025 చట్టంపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రైతుల కష్టాలపై కమిటీ అధ్యయనం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతుల సమస్యలు, భూముల గల్లంతు పరిస్థితులను గమనించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ కమిటీ సూచనల ఆధారంగా భూ భారతి చట్టాన్ని రూపొందించినట్టు చెప్పారు. గతంలో ధరణి చట్టాన్ని నాలుగు గోడల మధ్య స్వార్థపూరితంగా తీసుకువచ్చినా, మూడేళ్లైనా నియమాలు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.
జూన్ 2 నాటికి సమస్యల పరిష్కారం
ప్రస్తుతం నాలుగు మండలాల్లో భూ భారతి చట్టాన్ని ప్రాయోగికంగా అమలు చేస్తూ అన్ని వివరాలు, దరఖాస్తులు సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. జూన్ 2 నాటికి వీలైనన్ని భూ సమస్యలు పరిష్కరించి, అర్హులైన వారికి ప్రభుత్వ భూములను పట్టాలుగా అందించనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు వివరించారు.
ఐదంచెల వ్యవస్థ – ట్రిబ్యునల్ అవకాశం
భూ యజమానులకు న్యాయం జరిగేలా తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ఎ వరకు ఐదంచెల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. సీసీఎల్ఎ వద్ద కూడా న్యాయం జరగకపోతే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైనన్ని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
తప్పు చేసే అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం
రాష్ట్రంలో వచ్చే నెల 10వ తేదీకి రెవెన్యూ, గ్రామ పరిపాలనా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. తప్పు చేసే అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గతంలో రైతు బంధు కోసం భూమిలేని గులాబీ పార్టీ కార్యకర్తలకు కూడా పట్టాదారు పత్రాలు ఇచ్చిన దుర్మార్గాన్ని గుర్తు చేశారు. ఇకపై అటువంటి అక్రమాలకు తావు ఉండదని హెచ్చరించారు. రెవెన్యూ వ్యవస్థను పేదలకు చట్టంలా ఉపయోగపడే విధంగా మలుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.








