*రఘునాధపాలెం గ్రామంలోని పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
ఖమ్మం, మే -01, మహా.
పల్లె దవాఖానా ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారి పట్ల సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం రఘునాధపాలెం మండల కేంద్రంలోని పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, సాధారణ ప్రాధమిక వైద్యసేవలు, గర్భిణీ మహిళలకు అందుతున్న సేవలు, ఆసుపత్రి నిర్వహణ మొదలగు వివిధ అంశాలను కలెక్టర్ పరిశీలించారు. పల్లె దవాఖాన ద్వారా ప్రజలకు అందించనున్న వైద్య సేవలు, ఔషధ వివరాలను, గర్భిణులకు అందించు వైద్య సేవలు, రాబోయే వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, స్థానికంగా వచ్చే రోగాలు వాటి పై వైద్య సిబ్బంది చేపట్టే నివారణ చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, పల్లె దవాఖాన ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, డాక్టర్లు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, పల్లె దవాఖానలో, ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న సేవల గురించి గ్రామ ప్రజలకు వివరించాలని, వారితో మమేకమై ప్రభుత్వపరంగా అందిస్తున్న వైద్య సేవలపై భరోసా కల్పించాలని, గ్రామ పరిధిలో ఉన్న గర్భిణీలు అనీమియాతో బాధపడకుండా ఐరన్ టాబ్లెట్లు విధిగా అందించాలని, ఏఎన్ఎంలు దగ్గర ఉండి గర్భిణీలు క్రమం తప్పకుండా ఐరన్ టాబ్లెట్లు వేసుకునే విధంగా చూడాలని తెలిపారు.
ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది ప్రవర్తన విధానం మరింత మెరుగ్గా ఉండాలని, మనం ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే ఆలోచనా విధానంతో పని చేయాలని, పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించడం, సేవా దృక్పథంతో పని చేయడం వైద్య శాఖలో చాలా అవసరమని అన్నారు.
ఆసుపత్రి సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడానికి వీలు లేదని, ఆసుపత్రి సిబ్బంది సకాలంలో హాజరు కావాలని అన్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల గురించి, ఎన్ని సాధారణ, సిజేరియన్ ఆపరేషన్లను చేసింది అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని, ఈ దిశగా మొదటి నుండే గర్భిణిలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, ప్రసవం దగ్గరికి వచ్చిన గర్భిణీ మహిళను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాలని అన్నారు.మందుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకొని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడా మందుల కొరత ఉండటానికి వీల్లేదని అన్నారు.
ఆనతరం 108 అంబులెన్స్ ను పరిశీలించి సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు. ప్రజలకు వారు ప్రాధమికంగా అందించే చికిత్స విధానం అడిగి తెలుసుకున్నారు. ఇంక ఏమైనా వసతులు, వైద్య అవసరాలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మీరు రోగులకు అందించే సహాయం ఎంతో విలువైనదని వారిని కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.








