ఖమ్మం – మహా.
వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం మే 4న జరిగే నీట్ యు.జి. ప్రవేశ పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్, కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి నీట్ యు.జి. ప్రవేశ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పరిధిలో మే 4న మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే నీట్ యు.జి. ప్రవేశ పరీక్ష రాసే 2,739 మంది విద్యార్థుల కోసం 6 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలనీ, పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.పరీక్షకు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎక్కడ ఎటువంటి మాల్ ప్రాక్టీస్ నమోదు కాకుండా జాగ్రత్తలు వహించాలని, సీసీటీవీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పరీక్షను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అన్నారు.
మే 4న ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని, మధ్యాహ్నం 1.30 నిమిషాలకు గేట్ మూసి వేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులంతా తప్పనిసరిగా మధ్యాహ్నం 1.30 లోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ ప్రింట్ అవుట్ తీసుకొని పరీక్ష కేంద్రాలకు రావాలని, అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని, పరీక్ష హాల్ ఇన్విజిలేటర్ ఒక కాపీ అడ్మిట్ కార్డ్ కలెక్ట్ చేసుకుంటారని, అభ్యర్థులు రెండు కాపీలు తీసుకుని రావాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు https://neet.nta.nic.in పోర్టల్ నుంచి నీట్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డ్ లను డౌన్ లోడ్ చేసుకోవాలని, అభ్యర్థులు ముందుగానే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, పోస్ట్ కార్డు సైజు ఫోటో, ఫోటోతో కూడిన ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్…) తప్పనిసరిగా తీసుకొని రావాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్, ట్యాబ్లెట్, బ్లూటూత్, స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతి లేదని, షూస్, బెల్ట్, ఆభరణాలు ధరించవద్దని, హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకొని రావాలని, మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రం గేట్ మూసివేస్తామని, గేటు మూసిన తర్వాత ఎవ్వరిని లోపలికి అనుమతించమని, అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, నీట్ పరీక్ష జిల్లా నోడల్ అధికారి నరేంద్ర, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.








