ఖమ్మం, మే 7 , మహా.
నగరంలోని ట్రాఫిక్ సమస్యలకు స్థిరమైన పరిష్కారం కల్పించేందుకు మున్సిపల్ కమిషనర్ బుధవారం ఇంజనీరింగ్ , టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులతో కలిసి విస్తృతంగా రహదారుల పరిస్థితిని పరిశీలించారు. ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ రోడ్, కష్వా బజార్ రోడ్, మున్సిపల్ కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ వరకు వెళ్లే ప్రధాన రహదారులపై స్థల పరిశీలన చేపట్టారు.
సందర్శన సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రహదారి వెడల్పు తక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జాం జరుగుతోందని, దీనివల్ల వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోందని స్థానికులు, వ్యాపార వర్గాలు కమిషనర్ గారికి వివరించారు. ప్రజల అభ్యర్థనలతోపాటు భవిష్యత్తు అవసరాలనూ పరిగణలోకి తీసుకున్న కమిషనర్ గారు, వీలైనంత మేర రహదారులను విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను గుర్తించేందుకు, ట్రాఫిక్‌కు అడ్డుగా మారుతున్న అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. అవసరమైతే ఆక్రమణల తొలగింపు, రహదారి విస్తరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర డ్రైనేజీ వ్యవస్థపై కూడా కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. వరద నీరు జారిపోయే మార్గాలను పరిశీలించి, ఇప్పటికే ఉన్న కాలువలను శుభ్రం చేయడంతో పాటు, అవసరమైతే కొత్త కాలువల నిర్మాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ స్థల పరిశీలనలో టౌన్ ప్లానింగ్ విభాగాధిపతులు, మున్సిపల్ ఇంజనీర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ సూచనలతో అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించాలని స్పష్టం చేశారు.







