- ప్రతి జిల్లాలో ప్రత్యేక ‘హోల్డింగ్ సెంటర్లు.
కోల్‌కతా,మహా.
పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై అక్కడి నూతన ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో తిష్టవేసిన అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను గుర్తించి, వారిని తిరిగి స్వదేశాలకు పంపించివేసేందుకు (డిపోర్ట్) వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ‘హోల్డింగ్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చొరబాట్లను అరికట్టడమే లక్ష్యంగా ‘డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్’ (గుర్తించడం, తొలగించడం, బహిష్కరించడం) విధానాన్ని పక్కాగా అమలు చేస్తోంది.
ఈ వ్యూహాత్మక నిర్ణయానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ హోం మరియు హిల్ అఫైర్స్ విభాగానికి చెందిన ఫారినర్స్ బ్రాంచ్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు (డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు) మరియు పోలీసు యంత్రాంగానికి లిఖితపూర్వక ఆదేశాలు, స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. తమతమ పరిధుల్లో ఈ హోల్డింగ్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను తక్షణమే గుర్తించాలని, తదుపరి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన జిల్లాలు, అక్రమ వలసదారులు ఎక్కువగా ఆశ్రయం పొందే సున్నితమైన ప్రాంతాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
డిపోర్ట్ చేసే వరకూ ప్రత్యేక నిఘా
రాష్ట్రంలో పట్టుబడే అక్రమ వలసదారులపై కఠిన నిఘా ఉంచడమే ఈ హోల్డింగ్ సెంటర్ల ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర హోం శాఖ నిబంధనల ప్రకారం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పట్టుబడే అక్రమ బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను మరియు జైలు శిక్ష ముగించుకుని విడుదలైన విదేశీ ఖైదీలను నేరుగా జైలుకు పంపకుండా ఈ ప్రత్యేక సెంటర్లకు తరలిస్తారు. సదరు విదేశీయుల గుర్తింపు ప్రక్రియను నిర్ధారించడం, బయోమెట్రిక్ డేటాను సేకరించడం మరియు వారిని చట్టబద్ధంగా స్వదేశానికి పంపించేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తయ్యేంత వరకు (గరిష్టంగా 30 రోజుల పాటు) ఈ హోల్డింగ్ సెంటర్లలోనే ఉంచుతారు. అనంతరం వారిని నేరుగా సరిహద్దు భద్రతా దళానికి అప్పగించి, సరిహద్దుల గుండా పంపించివేసే ప్రక్రియను చేపడతారు.
ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు
ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ అక్రమ వలసల అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చుకుంది. రాష్ట్రంలో చొరబాట్లను పూర్తిగా అరికడతామని, సరిహద్దులను పటిష్టం చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. నాటి ప్రచార సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం మాట్లాడుతూ.. అసోంలో చొరబాట్లను ఏ విధంగానైతే అడ్డుకున్నామో, బెంగాల్‌లోనూ అదే రీతిలో అక్రమ వలసలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో.. తన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం బీఎస్‌ఎఫ్‌కు 27 కిలోమీటర్ల భూమిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా హోల్డింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఎన్నికల హామీని పక్కాగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది.







