Mahaa Daily Exclusive

  ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి….

Share

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.
* సనాతన ధర్మానికి గౌరవం ఇవ్వండి.
* అజ్మీర్ షరీఫ్ దర్గా అధిపతి జైనుల్ అబెదిన్ సంచలన డిమాండ్.
* బక్రీద్ పండుగ వేళ గోవధను పూర్తిగా నిషేధించాలని ముస్లిం మత పెద్ద పిలుపు.
* గోమాత సంరక్షణపై కేంద్ర ప్రభుత్వానికి సూఫీ సేక్యులర్ ఫోరమ్ విజ్ఞప్తి.
ఢిల్లీ, మహా.
దేశంలో మత సామరస్యాన్ని, గంగా-జమునా తెహజీబ్ (హిందూ-ముస్లిం ఐక్యత) సంస్కృతిని మరింత బలోపేతం చేసే దిశగా ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రధాన అధిపతి (దివాన్) సయ్యద్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక సంచలన విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో పరమ పవిత్రంగా భావించే ఆవును ‘جాతీయ జంతువు’గా అధికారికంగా ప్రకటించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) సమీపిస్తున్న తరుణంలో ఆయన నేతృత్వంలోని ‘సూఫీ సేక్యులర్ ఫోరమ్’ ప్రతినిధులు దిల్లీలో సమావేశమై దేశంలో శాంతిభద్రతలు, మత సామరస్య పరిరక్షణే ధ్యేయంగా పలు కీలక తీర్మానాలు చేశారు. హిందూ సోదరుల మతపరమైన నమ్మకాలను, సనాతన ధర్మ సెంటిమెంట్లను ముస్లింలు కూడా సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఉందని, అందుకే దేశవ్యాప్తంగా గోవధను (ఆవులను చంపడాన్ని) పూర్తిగా నిషేధించడంతో పాటు ఆవుకు జాతీయ హోదా కల్పించాలని ఆయన కేంద్రానికి సూచించారు.
ఈ చారిత్రాత్మక డిమాండ్ వెనుక ఉన్న సామాజిక, మతపరమైన కోణాలను దర్గా దీవాన్ సయ్యద్ జైనుల్ అబెదిన్ సుదీర్ఘంగా వివరించారు. భారతదేశం వంటి విభిన్న సంస్కృతులు గల దేశంలో ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించుకున్నప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. హిందూ సమాజం ఆవును కేవలం ఒక జంతువుగా కాకుండా ‘గోమాత’గా, తమ సంస్కృతికి ప్రతీకగా ఆరాధిస్తుందని, ఆ సెంటిమెంట్‌ను ముస్లిం సమాజం కూడా మనస్ఫూర్తిగా అంగీకరించాలని కోరారు. బక్రీద్ పండుగ సందర్భంగా నిర్వహించే ఖుర్బానీ (త్యాగం) కార్యక్రమాలలో ముస్లింలు ఎవరూ కూడా ఆవులను బలి ఇవ్వవద్దని, ఇస్లాం ధర్మం ప్రకారం కేవలం ఆవును మాత్రమే బలి ఇవ్వాలనే నిర్బంధ నిబంధన ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఆవుకు ప్రత్యామ్నాయంగా ఇతర జంతువులను ఖుర్బానీ ఇవ్వవచ్చని, కాబట్టి హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినకుండా ముస్లింలంతా ఈ పండుగ వేళ ఎంతో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
గోసంరక్షణకు చట్టపరమైన పటిష్టత కల్పించడం ద్వారానే దేశంలో కొన్ని శక్తులు సాగిస్తున్న మతపరమైన ఉద్రిక్తతలకు, గొడవలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయవచ్చని సూఫీ సేక్యులర్ ఫోరమ్ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో ఒక ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి, ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ చట్టం చేయాలని కోరింది. దీనివల్ల దేశంలోని మెజారిటీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరడమే కాకుండా, ముస్లిం సమాజం తరఫున హిందూ సోదరులకు ఒక గొప్ప సద్భావనా సందేశం అందినట్లవుతుందని దర్గా అధిపతి స్పష్టం చేశారు. అజ్మీర్ షరీఫ్ వంటి అత్యున్నత ముస్లిం ఆధ్యాత్మిక కేంద్రం నుండి ఇలాంటి శాంతియుతమైన మరియు ప్రగతిశీల డిమాండ్ రావడం జాతీయ స్థాయిలో సరికొత్త చర్చకు దారితీయగా, పలువురు సామాజిక విశ్లేషకులు , ఆధ్యాత్మిక పెద్దలు ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు.