తల్లాడ, మే, 9(మహా ):కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు రాష్ట్ర ప్రజలు మోసపోయారని, మార్పు మార్పు అంటే ప్రజలు కోరుకున్న ఫలితం ఐదేళ్లు అనుభవించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని మిట్టపల్లిలో గ్రామంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి కాంస్య విగ్రహావిష్కరణకు కేటీఆర్ హాజరై విగ్రహావిష్కరణ చేశారు.అనంతరం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దు ప్రాంతంలో ఏర్పడిన యుద్ధ వాతావరణ సమయంలో సభలు వద్దనుకున్న రైతుల పక్షపాతి, రాజకీయ చతురత కలిగిన నాయకుడైన రాయల శేషగిరి విగ్రహావిష్కరణే మనమిచ్చే ఘనమైన నివాళి అని భావించి హాజరవడం జరిగిందని ఆయన తెలిపారు.అనంతరం అధికార కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు విని రాష్ట్ర ప్రజలంతా మోసపోయారని,ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు అటుకెక్కాయని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగటంలేదని,కెసిఆర్ కిట్ కనుమరుగైందని,రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని, మహిళలకు 2500 ఊసే లేదని, బోనస్ పూర్తిస్థాయిలో రాలేదని,తులం బంగారం మాట ఎత్తటం లేదని ఆయన ఎద్దేవా చేశారు.మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కోసం నిరంతరం పట్టుబడుతామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఘాటు వాక్యలు
సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి దివాళాకోరు ముఖ్యమంత్రి అని, తన చిన్నతనం నుంచి ఎందరో ముఖ్యమంత్రులు చూసుకుంటూ వచ్చానని ఇలా రాష్ట్ర పరువును తీసే విధంగా ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదని ఆయన అన్నారు.ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారన్న రేవంత్ ను.. దొంగను దొంగలా చూడకపోతే ఎలా చూస్తారని ఎద్దేవ చేశారు.ఢిల్లీ వెళ్తే కేంద్ర ప్రభుత్వ పెద్దలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని,గుడిలో చెప్పులు ఎత్తుకుపోయేవారిలా చూస్తున్నారనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
ముగ్గురు మంత్రులతో జిల్లాకేమి లాభం
కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు వచ్చాయి తప్ప జిల్లాకి మాత్రం అల్లికి అల్లి సున్నా కి సున్నా తప్ప ప్రయోజనం లేదన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు సీతారామ నీళ్లు నెత్తిన చల్లుకున్నారే తప్ప చుక్క నీరివ్వలేదన్నారు.
ముగ్గురు మంత్రులున్నా చేసింది శూన్యం..
ఉప ఎన్నిక జరిగితే బి ఆర్ ఎస్ దే విజయం
పాలేరులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా భారీ మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి గెలువడం ఖాయమని అన్నారు.భద్రాచలంలో ఉపఎన్నికలు రావడం ఖాయమని,మధ్యంతర ఎన్నికలకు జిల్లాలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని సూచించారు.లింగాల కమల్ రాజ్ ను ఓడించేందుకు భట్టి విక్రమార్క ప్రజలకు తప్పుడు హామీలిచ్చారని,బాండ్ పేపర్లు రాసి దేవుని గుడిలో పెట్టి ఎన్నికల్లో గెలిచిన భట్టి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని,అందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు గులాబీ పార్టీనే అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
రీ కాల్ వ్యవస్థ లాంటి సంస్కరణలు తేవాలి
ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని,420 హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఐదు సంవత్సరాల పాటు భరాయించాల్సిందేనని కేటీఆర్ అన్నారు.మోసపోతే గోస పడతావని కెసిఆర్ ప్రతి నియోజకవర్గంలో లక్ష మందితో మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పిన మార్పు కావాలంటూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుందని ఇప్పుడు మార్పు బాగుందా? అని ప్రజలను ప్రశ్నించారు.అపర మేధావి అంబేద్కర్ ఆనాడు రాసిన రాజ్యాంగంలో ఇటువంటి దివాలా కోరు మాటల మనిషి ఎన్నిక అవుతాడని ఊహించలేదని, ఒకసారి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు బరాయించాల్సిందేనని, ఇటువంటి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత రీ కాల్ వ్యవస్థ లాంటి సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించాడు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ తాత మధుసూదన్,రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,రేగా కాంతారావు,వనమా వెంకటేశ్వర్ రావు,మెచ్చా నాగేశ్వర్ రావు,తాటి వెంకటేశ్వర్లు,కొండబాల కోటేశ్వరరావు,కందాల ఉపేందర్ రెడ్డి, బానోతు హరిప్రియ,మదన్ లాల్,బాల్క సుమన్,జిల్లా పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.








