Mahaa Daily Exclusive

  రు.60 లక్షల విలువైన గంజాయి పట్టివేత ఒకేరోజు మూడు సంఘటనలలో పట్టుబడ్డ 110 కేజీల గంజాయి ..!

Share

మహా భద్రాచలం

ఒరిస్సా, చతిస్గడ్ రాష్ట్రాల నుండి భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న నిషేధిత గంజాయి రవాణాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి పెట్టారు. శుక్రవారం ఒక్క రోజే మూడు వేర్వేరు దాడులలో 60 లక్షల రూపాయల విలువైన 110 కేజీల గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం పట్టణంలోని గోదావరి ఇసుక ర్యాంప్ సమీపంలో అనుమానంగా వెళుతున్న కారును తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న 75 కేజీల గంజాయి పట్టుబడినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్ తెలిపారు. ఒరిస్సా నుండి భద్రాచలం మీదుగా గంజాయిని కారులో రాజస్థాన్ తరలిస్తున్నారని పేర్కొన్నారు. పట్టుకున్న గంజాయి విలువ కారుతో కలిపి రు. 41 లక్షల విలువ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కేసులో రాజస్థాన్ కు చెందిన అనిల్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ దేవ్ లను అరెస్ట్ చేశారు. వీరికి పాల్వంచ పట్టణానికి చెందిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలోవెల్లడించారని ఆయన తెలిపారు. ఒరిస్సా మల్కనగిరి జిల్లా నుండి హైదరాబాద్ కు కారులో అక్రమంగా తరలిస్తున్న 29.5 కేజీల ఎండు గంజాయిని భద్రాచలం చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్ పేర్కొన్నారు. గంజాయి విలువ రు. 14.5 లక్షల ఉంటుందని, ఈ కేసులో కడపకు చెందిన సాయి కృష్ణ, పవన్ రెడ్డి, హైదరాబాదుకు చెందిన శ్రీహరి అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో సంఘటనలో ద్విచక్ర వాహనంపై 6 కేజీల గంజాయి తరలిస్తూ ఒక వ్యక్తి పట్టుబడ్డాడని వెల్లడించారు. మూడు వేర్వేరు సంఘటనలలో 110 కేజీల గంజాయిని, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని రమేష్ తెలిపారు.